నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ఇప్పుడు ప్రత్యేక ఏపీకి కూడా బిల్‌గేట్స్ వంటి వ్యక్తి వచ్చి మరీ ఆయన విజన్‌ని మెచ్చుకున్నాడు. ఇక నాడు సినీ నటి జయప్రద మొదటగా నెల్లూరుజిల్లాకి చెందిన నాటి ఎమ్మెల్యే, నేటి వైసీపీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మొదటగా తెలుగుదేశంలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాటి యూపీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కి అన్ని తానే అయిన అమర్‌సింగ్ చలవతో ఎంపీగా యూపీ నుంచి గెలిచి దేశరాజకీయాలలో కూడా చక్రం తిప్పింది.
తాజాగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు అంటే తనకు ఎంతో ఇష్టమని, గతంలో సమైక్యాంధ్రలో, నేటి కొత్త ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన అద్భుతంగా పనిచేస్తున్నాడని కితాబునిచ్చింది. త్వరలో ఏ పార్టీలో చేరుతానో చెబుతానంది. దాంతో ఆమె కూడా టిడిపిలోకి మరలా రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్మిపార్వతికి దక్కనివ్వకుండా చంద్రబాబు లాగేసుకున్న తరుణంలో రజనీకాంత్ సైతం బాబుకి సపోర్ట్‌గానే నిలిచాడు. ఇక తమిళ దర్శకుడు శంకర్ నాడు తాను చంద్రబాబు పాలన చూసి ఇన్‌స్పైర్ అయి 'ఒకే ఒక్కడు' కథ రాసుకున్నానని చెప్పాడు. ఇక జీవిత, వాణివిశ్వనాథ్‌లు కూడా టిడిపిలోకి రావడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఇక తమిళనాడు రాజకీయాలలోకి ఎంటరై, త్వరలో సొంత పార్టీని స్థాపించబోతున్న లోకనాయకుడు కమల్‌హాసన్ సైతం తాజాగా తనకు చంద్రబాబు అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఈ మద్య వరుసగా కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేసుకుంటున్న కమల్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, ఐ యామ్ ఏ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు. బిజెపితో దోస్తీ కట్టిన ఆయనకు నేను అభిమానిని. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే ఆయన నాడు ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అద్భుతాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు కూడా కొత్త ఏపీలో ఆయన సంచలనం సృష్టిస్తున్నాడు. త్వరలో ఆయన్ను కలుస్తానని చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది...!