'పీఎస్వీగరుడవేగ' రిలీజ్‌కి ముందు రాజశేఖర్ కారుతో యాక్సిడెంట్ చేశాడు. దాంతో ఆయన తాగి కారును నడిపాడని వార్తలు వచ్చాయి. కానీ పోలీసుల ఎంక్వైరీలో కూడా రాజశేఖర్ మద్యం తాగి యాక్సిడెంట్ చేయలేదని తేలింది. ఇప్పటికే ఈ విషయం ఆయన పలుసార్లు చెప్పాడు. మరలా మరలా మన మీడియా వారు ఆయన్ను అదే అదే ప్రశ్నను అడుగుతుండటంతో చదివేవారికి, వినేవారికి అది విసుగొస్తోంది. తాజాగా ఈ యాక్సిడెంట్‌పై మరోసారి ఆయనకు ప్రశ్న ఎదురుకాగా.. ఆయన మాట్లాడుతూ, ఆరోజు నేను, జీవిత, దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌లం కలిసి 'పీఎస్వీగరుడవేగ' ప్రమోషన్స్ ఎలా చేయాలి అని చర్చించుకుంటున్నాం. నేను చెప్పింది జీవితకి నచ్చలేదు దాంతో కోపం వచ్చి చెన్నై వెళ్దామని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాను.
కానీ మనసు మార్చుకుని ఇంటికి బయలుదేరాను. అప్పటికే మా అమ్మ మరణం వల్ల బాధని తట్టుకోలేక డిప్రెషన్‌లో, కోపంలో ఉన్నాను. దాంతో యాక్సిడిప్రెసివ్ మాత్రలు వేసుకున్నాను. అవి నిద్ర మాత్రలు. రాత్రిపూట వేసుకోవాల్సిన ఆ మాత్రలను పగలే వేసుకున్నాను. దాంతో మత్తు వచ్చింది. పైగా ఆ కారు ఆరోజే రిపేర్ నుంచి బయటికి వచ్చింది. బ్రేక్‌లు సరిగా పడటం లేదు. నేను ఓ చోట కారును ఆపాను. మరో వ్యక్తి వచ్చి తన కారును నా ముందు ఆపాడు. నా కారుని తీయడంలో ఆయన కారుని గుద్దాను. కేవలం ఇది ఆ మాత్రల వల్ల, బ్రేక్‌లు పనిచేయకపోవడం వల్లనే జరిగింది అని చెప్పుకొచ్చాడు.
అయినా డాక్టర్ అయి ఉండి ఆయన పగటిపూట డిప్రెషన్ తగ్గడానికి మత్తునిచ్చే మాత్రలు మింగడం మాత్రం తప్పు. ప్రాణాలకు ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆయన డిప్రెషన్ వల్ల మరో కుటుంబం జీవితాంతం డిప్రెషన్‌లో ఉండిపోవాల్సివచ్చేది....!