సినిమాలకు ఆంధ్ర, నైజాం హక్కులు చాలా కీలకం. అయితే ఆంధ్రాలో ఉత్తరాంధ్ర, కృష్ణ ఇలా విడిగా ఉంటాయి గాని.. నైజాం మాత్రం ఒక్క నైజామే. ఆంధ్రాలో అనేక ఏరియాలు ఉంటాయి కాబట్టి... అన్ని ఏరియాలలో అనేక రకాల డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. కానీ నైజామ్ లో మాత్రం ఇద్దరే ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు దిల్ రాజు కాగా మరొకరు ఆసియన్ సినిమాస్ వాళ్ళు. మరి నైజాల్ లో ఏ సినిమా కొనాలన్నా వీరిద్దరిలోనే ఉంటుంది. దిల్ రాజు కుదరదంటే ఆసియన్ సినిమాస్ వాళ్ళు, ఆసియన్ వాళ్ళు కాదంటే దిల్ రాజు. ఇక వేరే ఆప్షన్ లేదు. ఉన్న వారికి థియేటర్స్ వీరిద్దరే ఏర్పాటు చెయ్యాలి. అందుకే వీరిద్దరూ కొనకపోయారా.. డైరెక్ట్ గా వారిద్వారానే విడుదల చేసుకోవడం. ఎందుకంటే నైజాం లో ఇదివరకున్న చిన్న చితక డిస్ట్రిబ్యూటర్స్ చాలా అప్పుల్లో మునిగిపోయి చేతులెత్తేశారు.
అయితే దిల్ రాజు ఈ మధ్యన పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ కి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆయన నిర్మాతగా సూపర్ సక్సెస్ సినిమాలు చేస్తుంటే. డిస్ట్రిబ్యూటర్స్ గా కొన్ని పెద్ద సినిమాల్తో చేతులు కాల్చుకున్నాడు. ఇక దిల్ రాజు కొనకపోతే ఆ సినిమాని ఆసియన్ వాళ్ళు ఎంత చెబితే అంతకే కొంటారు. లేదంటే వారికీ సింగిల్ థియేటర్ కూడా ఇవ్వరు. మరి దిల్ రాజు, ఆసియన్ సినిమాస్ వాళ్ళు పవన్, ఎన్టీఆర్, మహేష్, చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల నైజామ్ హక్కులని కొంటున్నారు. మిగతా వాళ్ళ సినిమాలను డైరెక్ట్ గా విడుదలచేస్తున్నారు. ఆలా అయితే అడ్వాన్స్ మీద సినిమా విడుదల చేసి లాభాలొస్తే వాటాలు తీసుకోవడం.. లేదంటే నిర్మాత భరించడం అన్నట్టుగా వుంది నైజాం వాతావరణం.
ఇకపోతే ఇప్పుడు బాలకృష్ణ - ఏ ఎస్ రవికుమార్ కలయికలో వస్తున్న 'జై సింహా' హక్కులుపరంగా ఆంధ్ర వైడ్ గా మంచి బిజినెస్ జరుగుతున్నప్పటికీ.. నైజాం లో మాత్రం ఆసియన్ సునీల్ ద్వారా డైరెక్ట్ గా విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సునీల్ 'జై సింహా' హక్కులు కొనకపోయినా అతని ద్వారానే ఈ సినిమా నైజాం లో 'జై సింహా' నిర్మాత విడుదల చేసుకుంటున్నాడు. మరి పవన్, మహేష్, ఎన్టీఆర్ సినిమాలకున్న క్రేజ్ బాలకృష్ణ సినిమాలకు లేదా అని నసగడమే కానీ.. బయటికెవరు మాట్లాడడం లేదు.