ఎప్పటినుండో వాడుకలో ఉన్న టైటిల్ నే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న చిత్రానికి ఫైనల్ చేశారు. అందరి నోళ్ళలో నానిన ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ నే పవన్ కళ్యాణ్ PSPK 25 చిత్రానికి ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ రోజు సోమవారం అధికారికముగా ఈ టైటిల్ లోగోని సోషల్ మీడియాలో విడుదల చేశారు. కేవలం టైటిల్ మాత్రమే కాకుండా టైటిల్ తోపాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లుక్ ని కూడా విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న మూడో చిత్రం కావడం, పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రం కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక 'అజ్ఞాతవాసి' లుక్ లో పవన్ చాలా స్టైలిష్ గా అందంగా కనబడుతున్నాడు. అంతేకాకూండా చేతి వేలుకి ఒక ఐడి కార్డుని చుట్టుకుని గిరా గిరా తిప్పుతూ రఫ్ గా కనబడుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఇంత క్లాసీ లుక్ లో కనబడుతున్నాడంటే.. ముందునుండి ప్రచారం జరిగినట్టుగా పవన్ ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగానే కనబడనున్నాడా.. అనే అనుమానం కలగక మానదు. ఇక 'అజ్ఞాతవాసి.. ప్రిన్స్ ఇన్ ఎక్సైల్' అంటూ టైటిల్ లోగో కూడా ఆకట్టుకుంటుంది.
కీర్తి సురేష్ , అను ఇమ్మాన్యువల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని చిన్నబాబు నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.