ప్రస్తుతం మంచికో చెడుకోగానీ సినిమాలు, అందులోని సీన్స్, డైలాగ్స్, చివరకి బుల్లితెరపై వచ్చేషోలలో కూడా ఎవరినైనా కించపరిచినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్న అందరూ స్పందిస్తున్నారు. 'పద్మావతి' చిత్రం విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. సినిమా విడుదలైన తర్వాత అందులో అభ్యంతరాలు ఉంటే నిరసనలు, ఆందోళనలు చేస్తే దానికి అర్ధం ఉంది. కానీ సినిమాలో ఏముంది?ఎలా తీశారు? అని మనకి మనం ఊహించుకుని ఆందోళనలు చేస్తే నిజంగా అవి దర్శకుల మనోభావాలు, స్వేచ్చని హరించడమే అవుతుంది.
కాగా 'పద్మావతి' సినిమాని సెన్సార్ చేయకుండానే ప్రెస్‌కి ప్రీవ్యూ షో వేయడంపై ఆందోళన చెలరేగుతోంది. మరోవైపు సినిమా టీజర్లు, ట్రైలర్స్‌కి కూడా సెన్సార్ ఉండాలని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు టీవీ షోలు, సీరియల్స్‌కి కూడా సెన్సార్ ఉండాల్సిందే అని వాదిస్తున్నారు. ఇక విషయానికి వస్తే తమిళ దర్శకుడు బాల వంటి వారు మనదేశానికి చెందిన వాడు కావడం మన అదృష్టం. దానిని మనం గర్వంగా కూడా భావించాలి. శంకర్ వంటి దర్శకుడే బాల లాగా ఆలోచించేవారు, సినిమాలను తీసేవారు ప్రపంచంలోనే ఉండరని కితాబు నిచ్చాడు.
సత్యజిత్‌రే, శ్యాంబెనగల్,నర్సింగరావు, మృణాల్‌సేన్, దీపామెహతా, మణిరత్నంల తర్వాత ఈ తరంలో ఆయనంత రియలిస్టిక్‌గా చిత్రాలను తెరకెక్కించడం ఎవ్వరి వల్లా కాదు. ఇక ఆయన చిత్రాలలో ఏదీ సినిమాటిక్‌గా ఉండదు. డైలాగ్స్ నుంచి సీన్స్ వరకు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. కేవలం కమర్షియల్ చిత్రాలు చేస్తూ, పెద్ద పెద్ద స్టార్స్ చేత కూడా బూతులు మాట్లాడిస్తూ, విశృంఖ శృంగారాన్ని, హింసను చూపించే వారిని వదిలేసి బాల వంటి వారిని మనం తప్పుపట్టడం సరికాదు.
సాధారణంగా అందరూ అంటే ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో గానీ 90శాతం మంది పోలీసులు వాడే భాష, నిందుతులను విచారించే తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. గతంలో ఎప్పుడో భానుచందర్, అర్చన జంటగా బాలూ మహేంద్ర తీసిన 'నిరీక్షణ' చిత్రంలో పోలీసులు అన్యాయంగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి నగ్నంగా కొట్టడం, వారి మూత్రాన్ని నిందుతుల చేత తాగించడం వంటివన్నీ ఎంతో సంచలనం సృష్టించాయి.
తాజాగా దర్శకుడు బాల... జ్యోతిక రఫ్ అండ్ టఫ్ పోలీసు అధికారి పాత్రలో, జివి. ప్రకాష్ చిన్నచిన్న నేరాలు చేసే మురికివాడల్లో నివసించే వారిని ఆధారం చేసుకుని 'నాచియర్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఓ నేరస్తుడిని విచారించే క్రమంలో జ్యోతిక 'లం..కొడకా' అనే డైలాగ్‌ని వాడే టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది.
దీనిపై కోయంబత్తూరుకి చెందిన డ్రైవర్ రాజన్ ఈ డైలాగ్ మహిళలని కించపరిచేలా ఉందని, ఇది సమాచార, సాంకేతిక చట్టం ప్రకారం, ఐపీసీ సెక్షన్ ప్రకారం నేరమని,బాలపై చర్యలు తీసుకోవాలని కేసు వేశాడు. మరి బాల దానికి ఏం సమాధానం చెబుతాడో వేచిచూడాల్సివుంది!