విక్రమ్ కుమార్ - అఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హలో సినిమాని నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర పరిచయంతోపాటే... తన తల్లితండ్రులను పరిచయం చేసిన అఖిల్ అజయ్ పాత్రని పరిచయం చేశాడు. అవినాష్ కి హలో చెప్పండి అంటూ కామెడీగా సోషల్ మీడియాలో ఫన్ స్టార్ట్ చేసిన అఖిల్ హలోతో డిసెంబర్ 22 న థియేటర్స్ లోకి దిగబోతున్నాడు. ఈ సినిమాతో అఖిల్ ని హీరోగా నిలబెట్టడానికి నాగార్జున తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో చిన్న క్యామియో రోల్ లో నాగ్ మెరిసినట్లుగా ఆమధ్యన వార్తలొచ్చాయి.
ఇక ఇప్పుడు అఖిల్ వదిన సమంత కూడా హలోలో మెరవబోతుందనే టాక్ వినబడుతుంది. అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత తన మరిది కోసం హలో సినిమాలో కనబడబోతుందనే న్యూస్ అక్కినేని అభిమానులకు ఊపిరాడకుండా చేస్తుంది. మరి ఈ సినిమాలో నిజంగానే సమంత కనబడితే మాత్రం ఈ సినిమాకి ఎనలేని క్రేజ్ రావడం మాత్రం పక్కా. ఇప్పటికే అఖిల్ హలోకి పోటీగా నాని MCA తో బాక్సాఫీసు బరిలోకి దిగుతున్నాడు. ఇప్పుడు నానిని తట్టుకుని ప్రేక్షకులని మాయ చెయ్యాలంటే మాత్రం ఖచ్చితంగా హలో సినిమాలో ప్రేక్షకులకు నచ్చే విషయం ఉండాలి. అందుకే నిజంగా సమంత హలోలో కనబడితే ఈసినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఇకపోతే సమంత ఈసినిమాలో కనబడితే అఖిల్ కి వదినగానా..? లేక గర్ల్ ఫ్రెండ్ గానా.. లేదా మరేదైనా పాత్రలోనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.