ఎంతోకాలంగా ఈటీవీలో మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ప్రసారమవుతున్న కామెడీ షో 'జబర్దస్త్'పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెస్‌రెడ్డి అలియాస్ సహజకవి మల్లెమాల స్త్రీలను, పిల్లలను గౌరవిస్తూ 'బాలరామాయణం' వరకు ఎన్నో ఆణిముత్యాల వంటి చిత్రాలు నిర్మించారు. ఆర్ధికంగా నష్టం వచ్చినా కూడా ఆయన ఏనాడు తన మనోభావాలకు విరుద్దంగా చెత్త చెత్త కామెడీలు, సీన్స్ తన చిత్రాలలో ఉంచేవారు కాదు. కానీ ఆయన కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రం తన తండ్రి మరణం తర్వాత 'మల్లెమాల' సంస్థను స్థాపించి ఇలాంటి వికృతమైన కామెడీషోలను నిర్వహిస్తుండటం బాభాకరం.
తాజాగా ఈ 'జబర్దస్త్' షోలో స్క్రిప్ట్‌రైటర్, కమెడియన్ హైపర్‌ఆది అనాథపిల్లలపై చేసిన స్కిట్, అందులో వారిని హీనంగా మాట్లాడుతూ చేసిన కామెడీపై ఇప్పుడు రగడ ముదిరింది. ఈ షో తమ మనోభావాలను దెబ్బతీసిందని అనాథ ఆశ్రమాలలోని విద్యార్ధినీ విద్యార్ధులు, మానవహక్కుల సంఘాలు, మేధాసంఘాలు, మహిళా సంఘాలు మానవ హక్కుల కమీషన్ 'హెచ్‌ఆర్‌సీ'లో ఫిర్యాదు చేయడమే కాదు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైపర్ ఆది చేసిన స్కిట్, అందులోని వ్యాఖ్యలు తమను తీవ్ర మనోవేదనకు గురి చేశాయని, హైపర్ ఆది ఏదో గొప్ప జోక్ చేసినట్లు హోస్ట్ అనసూయ, జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజాలు పగలబడి నవ్వారని వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో 24గంటల్లో చర్యలు తీసుకోవాలని హెచ్చరించిన అనాథ పిల్లలు తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తమ్మల నాగేశ్వరరావుకి ఫిర్యాదు చేశారు.
మరోపక్క ఇటీవల అనాథ పిల్లలు ప్రభుత్వ పిల్లలని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి వారు గుర్తు చేస్తూ, 'జబర్దస్త్' షోపై, స్కిట్ చేసిన హైపర్ ఆది, హోస్ట్ అనసూయ, జడ్జిలు నాగబాబు, రోజాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తి స్పందిస్తూ, తాను అనాథపిల్లలనే సపోర్ట్ చేస్తున్నానని తెలపడంతో ఇప్పటికే మెగాభిమానులు, కత్తి మహేష్‌ల మధ్య ఉన్న వివాదం కూడా ఇప్పుడు కొత్తరూపు తీసుకుంది.