నాటి అంజలీదేవి నుంచి నేటి రజనీకాంత్, పవన్, వెంకటేష్ వంటి వారి వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఎందరో నటీనటులు, సెలబ్రీటీలు స్వాముల ఉపదేశాలు, వారి ఆధ్యాత్మిక రచనలను వింటూ, చదువుతూ రిలాక్స్ అవుతుంటారు. పుట్టపర్తి సాయిబాబా నుంచి యోగానంద, ఓషో, నిత్యానంద, శంకరాచార్యులు... ఇలా ఎంతో మంది మార్గాలను, ఉపదేశాలను ఫాలో అయ్యే వారు ఎందరో ఉన్నారు. నేటి జనరేషన్‌లో తీవ్ర ఒత్తిడి, బిజీ బిజీ లైఫ్‌ల వల్ల వారు ఆ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. కనిపించని దేవుళ్ల కన్నా కనిపించే స్వామీజీలు, ఫక్కీర్లను, బాబాలను వారు అనుసరిస్తుంటారు. దానిలో తప్పు పట్టేందుకు ఏమీ లేదు. ఎవరి భావాలు వారివి. ఎవరి మార్గాలు వారివి. ఇక నేటి నటీమణులు జిమ్, యోగా, ఆధ్మాత్మిక చింతనతో ముందుకు సాగుతున్నారు. అదేకోవలోకి రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా వస్తుంది.
ఈమె సినిమాలు, జిమ్ వ్యాపారాలతో నిత్యం బిజీ. గత ఐదారు నెలలుగా విరామం లేకుండా పనిచేస్తున్నానని ఓ నెల రిలాక్స్ అవుతానని చెప్పింది. ఈమెకి ఆధ్యాత్మిక చింతన కూడా ఉండటంతో ఆమె త్వరలో సద్గురు బోధనలను స్వయంగా విని, ఆయన సేవలో తరించనుంది. ఇక సద్గురు విషయానికి వస్తే ఆయనకు దేశ విదేశాలలో ఎందరో భక్తులు ఉన్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, అందులోనూ రామ్‌చరణ్, ఉపాసనలు ఆయననే ఫాలో అవుతుంటారు. ఇటీవల సద్గురు స్వయంగా చిరంజీవి ఇంటికి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మెగాజంట సమయం దొరికినప్పుడల్లా ఆయన బోధనలే వింటూ ఉంటారు. ఇప్పుడు అదే దారిలో రకుల్ నడుస్తోంది.
నవంబర్ 27న ఏపీప్రభుత్వం గ్రామాల మద్య బంధాలు, అనుబంధాలు పెంచేందుకు గ్రామోత్సవాలను నిర్వహించనుంది. వైజాగ్‌లోని రాజీవ్ ఇండోర్‌స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ వేడుకకు సద్గురు రానున్నారు. దీనికి రకుల్‌తో పాటు నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు వంటి మంత్రులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సద్గురు సేవ చేసేందుకే రకుల్ వైజాగ్ రానుంది. ఈ సందర్భంగా గ్రామాల మద్య ఆటలు, పాటల పోటీలు నిర్వహించనున్నారు.