ఇప్పుడు ఎవరి నోట విన్నా పవన్‌కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్ మూవీ, పవన్ 25వ చిత్రంపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రీలుక్ విడుదల చేసి పవన్‌ని నీడలోనే ఉంచేశారు. 27వ తేదీన టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఇక త్రివిక్రమ్ చిత్రాల టైటిల్స్ ఎలా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. ఎంతో ఫాలోయింగ్ ఉన్న పవన్‌తో ఆయన 'జల్సా' అనే హమింగ్‌టైటిల్‌ని, 'చిన్నల్లుడా మజాకా' అనుకున్న టైటిల్‌ని ఉన్నట్లుండి పవన్ ఇమేజ్‌కి ఏమాత్రం ఊహించని 'అత్తారింటికి దారేది' చిత్రాలతో ఆయన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మిగిలిన దర్శకులతో తాను చేసే చిత్రాల టైటిల్స్‌ని సాధారణంగా పవనే నిర్ణయిస్తాడు. దాంతోనే ఆయనకిష్టమైన 'గబ్బర్‌సింగ్, సర్దార్‌గబ్బర్‌సింగ్' అనే టైటిల్స్‌తో చిత్రాలు వచ్చాయి.
ఇక 'అత్తారింటికి దారేది'లో ఆయన పాడిన 'కాటమరాయుడా...' అనే పాటను దృష్టిలో ఉంచుకుని, ఆ టైటిల్ కమెడియన్ కమ్ హీరో సప్తగిరి వద్ద ఉంటే అడిగి మరీ తీసుకున్నాడు. కానీ త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆయన స్క్రిప్ట్, డైలాగ్స్, టైటిల్... ఇలా ప్రతి విషయాన్ని త్రివిక్రమ్‌పై ఉన్న నమ్మకంతో ఆయనకే వదిలేస్తాడు. ఇక త్రివిక్రమ్ స్టోరీ రాసుకున్నప్పుడే టైటిల్‌ని అనుకున్నా దానిని చివరి వరకు రివీల్ చేయడు. గతంలో ఆయన తీసిన 'జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలలో కూడా ఎన్నో టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా ఆయన మాత్రం సడన్‌గా ఆ టైటిల్స్‌ని ప్రకంటించి, తన రూటే సపరేట్ అని సర్‌ప్రైజ్ చేశాడు. ఇక ఇప్పుడు మీడియా అంతా పవన్-త్రివిక్రమ్ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అని వారికి వారే రాసేసి దానినే రాస్తున్నారు. ఇక అప్పుడు విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్. తాజాగా పవన్‌ని నీడలో వెనుక నుంచి చూపిస్తూ రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్స్ చూస్తే దానికి 'అజ్ఞాతవాసి' అనేది కరెక్ట్‌గా సరిపోతుందనే నమ్మకంతో మీడియా, అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్నారు.
ఫ్యాన్స్ అయితే 'అజ్ఞాతవాసి' పేరుతో పోస్టర్స్‌ని కూడా తయారు చేసేసి, ఈ ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్‌ని సోషల్‌మీడియాలో పెట్టేస్తున్నారు. అయితే ఇదే టైటిల్‌ని త్రివిక్రమ్ కన్‌ఫర్మ్ చేస్తాడని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. గతంలో త్రివిక్రమ్ ఇచ్చిన షాక్‌లు చూస్తే త్రివిక్రమ్ అందరూ భావిస్తున్న 'అజ్ఞాతవాసి' నే ఫైనల్ చేస్తాడా? లేదా షాకిస్తాడా? అనేది 27న పవన్ వెలుగులోకి వస్తే గానీ చెప్పలేం...!