ఇప్పటివరకు టాలీవుడ్ లో పెద్దపెద్ద రికార్డులన్నీ బాహుబలి సీరీస్ పేరిట ఉన్నాయి. అంతేకాదు ఓవర్సీస్ రైట్స్ రికార్డు కూడా బాహుబలిదే. బాహుబలి 2 సినిమాకు భారీ స్థాయిలో (దాదాపు 30 కోట్లు) ఓవర్సీస్ హక్కుల కింద వచ్చింది. అయితే ఇప్పుడు బాహుబలి తర్వాతి స్థానంలో త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' నిలవనుంది. బాహుబలి సినిమా తర్వాత 'అజ్ఞాతవాసి' ఆ రికార్డును దక్కించుకుంది. పవన్ - త్రివిక్రమ్ ల 'అజ్ఞాతవాసి' సినిమా ఏకంగా 21 కోట్ల రూపాయల భారీ మొత్తానికి ఓవర్సీస్ హక్కులు అమ్ముడు పోయాయి.
బ్లూ స్కై సినిమా, ఎల్ ఏ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నాయి. ఇకపోతే డిసెంబర్ లో ఆడియో, జనవరి 10న ఈ సినిమా విడుదల కానుండగా.. ఓవర్సీస్ లో మాత్రం జనవరి 9 నే ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. దాదాపు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి ప్రీమియర్స్ జనవరి 9 నే పడబోతున్నాయి. అలా అజ్ఞాతవాసి విడుదలైన మొదటి రోజే కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తూనే... వసూళ్లు రాబట్టుకోవాలని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేశారు.
మామూలుగానే పవన్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు దర్శకుడిగా త్రివిక్రమ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అంత క్రేజ్ ఉన్న వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ అజ్ఞాతవాసి సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అందుకే అజ్ఞాతవాసికి ఓవర్సీస్ లో 21 కోట్ల రూపాయల ధర పలికింది. మరి బాహుబలి తర్వాత రికార్డుల స్థానంలో కూడా పవన్ అజ్ఞాతవాసే ఉంటుందేమో చూద్దాం.