తన కెరీర్‌లో ఇప్పటి వరకు చిరంజీవి నటించింది 150 చిత్రాలు. 151వ చిత్రంగా 'సై...రా' రూపొందనుంది. ఇక చిరంజీవి నటించిన ఈ 150 చిత్రాలలోఎన్నో క్లాసిక్స్, బ్లాక్‌బస్టర్స్, కళాత్మక చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక కమర్షియల్‌పరంగా చూస్తే 1991లో చిరంజీవి హీరోగా విజయశాంతి హీరోయిన్‌గా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన 'గ్యాంగులీడర్'ది ప్రత్యేక స్థానం. ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, అదిరిపోయే సాంగ్స్. ఇలా నవరసాలు ఉన్నాయి. ఈ చిత్రం అప్పటివరకు ఉన్న టాలీవుడ్ చిత్రాల రికార్డ్సుని బద్దలు కొట్టింది.
ఇక ఈ చిత్రం త్వరలో మరో సారి తెరకెక్కనుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మొదట స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పేరు వార్తల్లో బాగా వినిపించింది.కానీ ఓ సారి బన్నీ మాట్లాడుతూ ఈ చిత్రానికి నేను సరిపోను. చేస్తే రామ్‌చరణే చేయాలని చెప్పాడు. ఇక ఇటీవల మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, తన పెద మామయ్య చిత్రాలను తాను కూడా చేయాలనుకుంటున్నానని తెలిపాడు. ఇక ఆయన ఆల్‌రెడీ చిరంజీవి రెండో బిరుదైన 'సుప్రీం' పేరుతో సినిమా చేశాడు. ఇక తన మావయ్య హిట్ సాంగ్స్‌ని కూడా రీమిక్స్ చేస్తున్నాడు. ఆమధ్య మంచు మనోజ్ మాట్లాడుతూ, చిరంజీవి, తన తండ్రి కలిసి నటించిన 'బిల్లారంగా'ని సాయి, తాను చేయాలని ఉందని చెప్పాడు.
కాగా ప్రస్తుతం 'గ్యాంగ్‌లీడర్'ని మరోసారి సాయి ధరమ్ తేజ్ చేస్తున్నాడని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. మెగాభిమానులు కూడా అదే భావిస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'జవాన్' డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో సాయి బిజీగా ఉన్నాడు. ఆయన తాజాగా సోషల్‌మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'గ్యాంగ్‌లీడర్'ని ఎప్పుడు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే... అది నేను చేయకూడదని, రామ్‌చరణే చేయాలని స్పష్టం చేశాడు.