హీరోగా ఫేడవుట్ అయిన తర్వాత జగపతిబాబు విలన్ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా నటిస్తున్నాడు. ద్విభాషా చిత్రాల హవా నడుస్తున్నందున ఆయన త్వరలో మరింత బిజీ అయినా ఆశ్చర్యం లేదు. ఇక ఆయనకు తన మొదటి విలన్ రోల్ అయిన 'లెజెండ్' చిత్రానికి గాను ఉత్తమ విలన్ అవార్డు వచ్చింది. ఈ నంది వివాదాల గురించి మీడియా ఆయనను ప్రశ్నిస్తే అది మీ గొడవ నాది కాదు అన్నాడు. తాజాగా ప్రతి విషయానికి మీడియా కులం రంగు పులుముతోందని, నంది అవార్డులకు కూడా కులాన్ని అంటగట్టి దారుణంగా వ్యవహరిస్తోందని అన్నాడు.
అయితే ఆయనకు ఒక విషయం తెలియకపోవచ్చు. నంది అవార్డులను రాజకీయం చేసింది మీడియా కాదు. లైవ్‌షోలకి వచ్చి నానా రాద్దాంతం చేసింది మెగా క్యాంప్ తరపున బన్నీవాసు, నల్లమలుపుబుజ్జి, ఎన్వీప్రసాద్, నందమూరి క్యాంపు నుంచి ప్రసన్నకుమార్, మద్దినేని రమేష్‌బాబు, కాట్రగడ్డ ప్రసాద్ వంటి వారు మాత్రమే అని ఆయనకి తెలియాలి. తమ ఫీల్డ్‌లో ఉన్న కుల గజ్జిని జగపతి బాబు మీడియాకు అంటగడుతున్నాడు. ఇక ఇటీవల ఆయన చిన్న సినిమాల కోసం పాదయాత్రలంటూ వైజాగ్, విజయవాడ, తాజాగా హైదరాబాద్‌లో పాదయాత్రలు చేస్తున్నాడు. పనిలో పనిగా విజయవాడలో మాట్లాడుతూ, థియేటర్లన్నీ కొందరి చేతుల్లోనే ఉన్నాయని, చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని వాపోయాడు. అంటే ప్రస్తుతం థియేటర్లు ఎక్కువగా మెగా వారి క్యాంపులో ఉండటమే ఈ వ్యాఖ్యలకు అంతరార్ధమని చెప్పవచ్చు.
ఇంతకాలం గుర్తురాని చిన్నసినిమాలు, థియేటర్లు ఆయనకి ఇప్పుడే తెలిశాయా? అని అడిగితే అన్ని చిన్న సినిమాల గురించి నేను మాట్లాడలేను కదా..! అన్నాడు. ఇక ఈయన ప్రస్తుతం 'రచయిత' అనే సినిమా కోసం తెల్ల లుంగీ, తెల్లచొక్కాలలో పాదయాత్రలు చేస్తూ రాజకీయ నాయకుడిలా, తమిళ పొలిటీషన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక పాదయాత్రల వంటివి సాధారణంగా రాజకీయ నాయకులు చేస్తుంటారు. మరి ఈ పాదయాత్రలు పొలిటికల్ ఎంట్రీకి శాంపిల్‌గానా అనే సందేహం మాత్రం వస్తోంది.