పోసాని ఒకప్పుడు కేవలం రచయితగా పనిచేస్తూ, ఎప్పుడో ఒకసారి సినిమాలలో తళుక్కుమనే వాడు. నాడు సినిమా వారికి తప్ప బయటి వారికి పోసానికృష్ణమురళి ఎవరు? ఆయన భావాలు ఏంటి? ఆయనది ఏ కులం అనేవి తెలియవు. అలాంటి సమయంలో ఆయన నాడు సమైక్యాంధ్రలో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌కి, కాంగ్రెస్‌కి ఓటు వేయవద్దని, చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయాలో తెలుపుతూ లక్షల ఖర్చుతో ప్రతి దినపత్రికలో బ్యాక్‌పేజీ ఫుల్ యాడ్ ఇచ్చాడు. అందులో ఆయన బాబుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నానో పూర్తిగా వివరించాడు. దాంతో నాడు ఆయన కమ్మవాడు కాబట్టే చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత కాపు పార్టీగా ముద్రపడిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల్లో నిలబడ్డాడు. తాజాగా ఆయన వచ్చే ఎన్నికల్లో తాను జగన్‌కే ఓటు వేస్తానని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన చూసి రెండోసారి ఆయనకు ఓటు వేయాలా? వద్దా? అని ఆలోచిస్తానని తెలిపాడు. ఒకప్పటిలా చంద్రబాబు డేరింగ్‌గా ముందుకు పోవడం లేదని, ఏ పని చేస్తే ఏ కులం ఓట్లు వస్తాయనే ధోరణి కనిపిస్తోందని ఓపెన్‌గానే చెప్పేశాడు.
ఇక నంది అవార్డుల విషయంలో కూడా ఆయన నారా లోకేష్‌పై, టిడిపిపై మండిపడ్డాడు. తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు ఆంధ్రా నాయకులను మాత్రమే తిట్టారని, కానీ ఆంధ్రా ప్రజల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదని, కానీ చంద్రబాబు ప్రభుత్వం నాన్‌లోకల్, తెలంగాణకి పన్ను కడుతూ మమ్మల్ని విమర్శిస్తారా? అనే విషయంలో అట్టుడికి పోయి ఘాటు విమర్శలు చేసి తన నంది అవార్డుని కూడా తీసుకోనని చెప్పాడు. నిజానికి పోసానిని బాగా ఎరిగిన వారికి ఆయనకు కులం అంటే అసహ్యం అనేది అర్ధం అవుతుంది. కానీ కొందరు మాత్రం నాడు టిడిపికి సపోర్ట్ చేస్తే కమ్మలకు సపోర్ట్ ఇస్తున్నావు? అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం తరపున నిలబడితే నువ్వు కమ్మోడివి అయి చిరంజీవిని ఎందుకు మోస్తున్నావు? అని అడిగారు. ఇక ఇప్పుడు జగన్‌కి సపోర్ట్ చేస్తుంటే నీవు అవకాశ వాదివి అంటున్నారు.
ఇక పోసాని ఆమధ్య పవన్ రాజకీయాలకు పనికిరాడని, పిలిచి సీటు ఇచ్చినా తీసుకోనని, ఆయనకు ఓటు కూడా వేయనని చెప్పాడు. దాంతో నాడు చిరంజీవికి భజనపరుడు అని వ్యాఖ్యనించిన వారే.. ప్రస్తుతం ఆయన మెగా ద్రోహి అంటున్నారు. ఇవ్వన్నీ చూస్తే ప్రజలలో కులంపై ఉన్నధోరణి అర్ధమవుతోంది. ఇక నంది అవార్డుని తీసుకోకపోవడం అంటే చిన్నవిషయం కాదు. కానీ ఆయన జగన్ మెప్పు కోసమే ఇలా చేస్తున్నాడని అంటున్నారు. కానీ ఇప్పుడు నందులపై గోల చేస్తున్న వారందరూ 'మనం, రుద్రమదేవి'లను అడ్డుపెట్టుకుంటూ ఇన్‌డైరెక్ట్‌గా తమ కులం భావాలను చూపిస్తున్నారు. కానీ ఇందులో నిజమైన మగాడు అనిపించుకుంది మాత్రం ఈ 'రాజా'నే..!