స్టార్స్ చిత్రాలు సంక్రాంతి, వేసవి సెలవులలో ఒకరిపై ఒకరు పోటీకి వస్తున్నారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కూడా వచ్చి విజయం సాధించారే గానీ ఎవ్వరూ పూర్తిగా లాభాలను ఆస్వాదించలేదు. కారణం ఒకటి రెండు రోజుల తేడాలో వరుస చిత్రాలు వస్తే ఎంత మంచి చిత్రానికైనా కలెక్షన్లు తగ్గుతాయి. ఓపెనింగ్స్‌ని అందరూ పంచుకోవాల్సి వస్తుంది. కానీ నేడు సింగిల్‌గా వచ్చి హిట్ కొట్టడం కంటే పోటీలో వచ్చి హిట్ కొట్టామనే సంతృప్తే చాలని, దానినే గర్వంగా ఫీలవుతూ నిర్మాతల కొంప ముంచేలా పోటీ పడుతున్నారు. వచ్చే సమ్మర్‌కి ఒకే రోజున అంటే ఏప్రిల్ 27నే అల్లుఅర్జున్ 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా', మహేష్‌బాబు 'భరత్ అనే నేను' వస్తామని పట్టుదలగా ఉన్నారు.
ఇక స్టార్స్ విషయం వదిలేస్తే యంగ్ హీరోల విషయంలో మాత్రం ఈ పోటీ పూర్తిగా కొంపకొల్లేరు చేస్తుంది. ఆగష్టు11న లాంగ్ వీకెండ్ చూసుకుని ఏకంగా నితిన్ 'లై', బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'జయజానకి నాయకా', రానా 'నేనే రాజు నేనే మంత్రి' వచ్చి మూడు కూడా కలెక్షన్ల పరంగా దెబ్బతిన్నాయి. మరలా అలాంటి పోరే క్రిస్మస్ సీజన్‌లో జరగనుంది. అఖిల్ నటించిన 'హలో' చిత్రం ముందుగా డిసెంబర్ 22న వస్తున్నామని చెప్పింది. దాంతో డిసెంబర్ 21న రావాలనుకున్న నాని-దిల్‌రాజుల 'ఎంసీఏ' చిత్రం ఓ వారం ముందుకు వెళ్లి డిసెంబర్ 15న విడుదల కానుంది. ఇది మంచి పరిణామం. కానీ అల్లువారి చిన్నబ్బాయ్ మాత్రం 'హలో' విషయంలో తగ్గేదే లేదంటున్నాడు. ఆయన నటిస్తున్న 'ఒక్క క్షణం' చిత్రాన్ని డిసెంబర్ 23న తీసుకురానున్నట్లు చెబుతున్నాడు.
ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవుగానీ ఆసక్తి మాత్రం ఉంది. అది కూడా అల్లుఅరవింద్ మీద, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన వి.ఐ.ఆనంద్ దీనికి దర్శకుడు కావడమే. మరి ఇదే జరిగితే ఎంత కాదన్నా అది అల్లుశిరీష్‌కే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే నాగార్జున - విక్రమ్ కెకుమార్‌ల కాంబినేషన్‌లో అఖిల్‌కి రీలాంఛ్‌గా భావిస్తున్న 'హలో'పై మంచి అంచనాలు ఉండటమేనని చెప్పాలి. మొత్తానికి ప్రస్తుతం బాల్ మాత్రం అల్లు వారి కోర్టులోనే ఉంది.