ఐదేళ్లు ఉండే సీఎంలను చూశాం..శంకర్ 'ఒకే ఒక్కడు'లో ఒకరోజు సీఎంని చూశాం. కానీ ఒక్క రోజు కూడా సీఎం కుర్చీలో కూర్చోని పవన్ మాత్రం ఒక రోజంతా సీఎంగా నిలిచాడు. విషయానికి వస్తే పవన్ లండన్‌లో అవార్డు తీసుకుని, అక్కడి విశ్వవిద్యాలయ విద్యార్ధులతో సమావేశాలలో మాట్లాడి లండన్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు. దీంతో జనసేన నాయకులు, మీడియా, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఎయిర్‌పోర్ట్‌లో పవన్‌ని ఆహ్వానించేందుకు, స్వాగతం పలికేందుకు వచ్చారు. వారితో అక్కడ జనాలు విపరీతంగా పోటెత్తారు.
ఇక పవన్ వచ్చిన వెంటనే 'సీఎం పవన్.. సీఎం' అంటూ నినాదాలు చేశారు. వారిని అలా అనకూడదని వారించాల్సింది పోయి పవన్ కూడా ఆనందంలో ఉబ్బితబ్బిబైపోయాడు. ఇలాంటి నినాదాలే నాడు 'మనీ' చిత్రంలో హీరో కావాలనుకునే బ్రహ్మానందంలా చిరంజీవి కొంప ముంచాయి. ఇప్పుడు అదే పరిస్థితి పవన్‌కి కూడా వస్తుండటం చూస్తే ఆయన అభిమానులు ఇంకా ఏడాదిపైగా ఉన్న ఎన్నికలలో పవన్ గెలిచి సీఎం అవుతాడని తేల్చేశారు. ఇలా ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన నేత పవన్ సీఎం అయిపోయాడు. మరి ఆయనని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 'సీఎం.. సీఎం' అన్నారంటే అది తెలంగాణకు సీఎంగానా? లేక ఏపీకి సీఎంగానా? అనేది మాత్రం పవన్ అభిమానులకే తెలియాలి.
ఇక ఆయన లండన్‌లో అందుకున్న ఐఈబీఫ్ అవార్డు విశ్వసనీయతపై, పవన్ అభిమానుల ప్రచారంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవార్డు తొలిసారిగా పవన్‌కే వచ్చిందని ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంతకుముందు 2015లోనే ఏపీ మాజీ చీఫ్ సెక్రటరి ఐవైఆర్ కృష్ణారావుకి వచ్చింది. మరోవైపు పవన్‌కి ఈ అవార్డు ఏ ప్రాతిపదికన ఇచ్చారో అనే విషయంలో కూడా పలు విమర్శలు వస్తున్నాయి. లండన్‌లో ఈ సంస్థ ఇచ్చిన అవార్డు కి రథసారధి అన్ని విజయ్‌గోయెలే. ఆయన చంద్రబాబుకి అతి ముఖ్యమైన వ్యక్తి. వీరిద్దరి మీద ఎన్నో వ్యాపార సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబుకు ఆయన బినామీ అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో పవన్‌కి ఈ అవార్డు చంద్రబాబు రికమండేషన్ ద్వారానే వచ్చిందంటున్నారు. ఇక విజయ్‌గోయెల్ నిజానికి లండన్‌లో ఏపీ ప్రభుత్వ రిప్రజెంటేటివ్ అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆ అవార్డుకి ఉన్న విశ్వసనీయతపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.