మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ అంటే అంతకు ముందు చిరంజీవి భజన ఉండేది. కానీ ఈమధ్య పవన్ భజన మొదలైంది. మెగాభిమానులు ఇప్పుడు చిరంజీవి కన్నా పవన్ నామస్మరణనే బాధ్యతగా భావిస్తున్నారు. ఇక పవన్ గురించి భజన చేస్తూ అసలు తమ వేడుక ఉద్దేశ్యాన్నే తారు మారు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా రూపొందుతున్న 'జవాన్' ప్రీ రిలీజ్ వేడుక మొత్తం 'జవాన్'ని వదిలేసి పవన్ భజనలో మునిగిపోయారు. చిత్ర యూనిట్ నుంచి అతిథుల వరకు పవన్‌కి దేవుడికి చేసినట్లు అష్టోత్తరాలు, సహస్రనామాల పొగడ్తలతో భజన మందిరంగా ఆ వేదిక నిలిచింది. అసలు ఈ వేడుకలో 'జవాన్' సినిమా గురించి చెప్పింది రెండు మూడు మాటలు మాత్రమే.
ఇక మెగాఫ్యామిలీ హీరోలందరిలో సాయిధరమ్‌తేజ్‌కి అందరి హీరోలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ లౌక్యం చూపిస్తున్నాడని, ఘట్టమనేని, అక్కినేని, మంచు ఫ్యామిలీ, నందమూరి...ఇలా అందరితో ఆయన తన పాటలను ఒక్కొక్కటి రిలీజ్ చేయిస్తూ గతంలో తన తెలివిని ఉపయోగించాడు. కానీ వరుసగా మూడు నాలుగు ఫ్లాప్‌లు వచ్చి 'తిక్క' కుదిరిన తర్వాత ఇక ఆయన కూడా పవన్ భజన తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తోంది. సాదారణంగా పవన్ నామస్మరణ చేస్తే అది ఆయన అభిమానులకు ఎంతో ఘంటసాల పాటలా అతి మధురంగా ఉంటుంది. వీనుల విందుగా ఫీలవుతారు. దాంతో పవన్ పేరు చెప్పుకుంటే సినిమాకి ఓపెనింగ్స్ అయినా బాగా వస్తాయని, సినిమా ఎలా ఉన్న పవన్ అభిమానులు మాత్రం ఆయనను పూజించే శిష్యబృందాల వారి చిత్రాలను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు.
నితిన్, సప్తగిరి, అలీ వంటి వారి విషయాలలో ఇది నిరూపితమైంది. కాబట్టి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కలెక్షన్లు సాధించాలంటే ఉన్నది ఒకే ఒక్క పవన్ అనే ఆయుధాన్నే ఈ సినిమా యూనిట్ వాడుకున్నట్లు అర్ధమవుతోంది. అయినా ఇలా చేస్తే మాత్రం ఓవర్గం అభిమానులను దూరం చేసుకోవడమే అవుతుందని చెప్పాలి.