చంద్రబాబునాయుడికి అవార్డులు పెద్దగా కలిసి రావడం లేదేమో అనే అనుమానం వస్తోంది. ఏకంగా మూడు ఏళ్లకు కలిపి ఒకేసారి నంది అవార్డులు ఇవ్వడంతో వీటిని సైకిల్ అవార్డులని, 'కమ్మ' అవార్డులని తీవ్రవివాదం చెలరేగుతోంది. దాంతో ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిన అవార్డులు కాస్తా బాబుకి బెడిసికొడుతున్నాయి. ఇక తాజాగా సోషల్‌మీడియా సెలబ్రిటీ అవార్డులను రానా, బాలీవుడ్ నటి దీపికాపడుకొనేలకు ఇచ్చారు. రానా తెలుగువాడు కావడంతో ఫర్లేదని, కానీ దీపికాపడుకొనే తప్ప మరో తెలుగు సెలబ్రిటీ దొరకలేదా? అనే విమర్శలు వస్తున్నాయి.
ఇక నంది అవార్డులతో పాటు దీపికాపడుకొనేకు అవార్డులని ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? కేవలం మీడియాను విపరీతంగా ఆకట్టుకోవడానికే ఈ అవార్డులను వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తన బావమరిది బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రానికి 'నవ' నందులు రావడంపై కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై తాజాగా మంత్రి, బాబు కుమారుడు లోకేష్ మాట్లాడుతూ, ఏపీలో ఆధార్- ఓటర్ కార్డులు లేని వారు కూడా హైదరాబాద్‌లో కూర్చుని గొడవలు చేస్తున్నారని, కేవలం ఇద్దరు ముగ్గురి వల్లే ఈ రచ్చలు జరుగుతున్నాయని సెటైర్ వేశాడు. మరోవైపు చంద్రబాబు కూడా ఈ విధంగా అవార్డులు పెను తుఫాన్‌ను రేపుతాయని ఊహించలేదట. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి విషయానికి కులం రంగు పులుముతున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో అనేక కారణాల వల్ల మూడేళ్లకు కలిపి ఒకేసారి నంది అవార్డులను ప్రకటించాం. ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం ప్రకారమే జ్యూరీ సభ్యుల చేత అవార్డులను ఎంపిక చేశాం. ఇలాంటి వివాదాలు వస్తాయని తెలిసి ఉంటే సర్వే చేయించి, ప్రజాభిప్రాయం ప్రకారం అవార్డులు ఇచ్చేవారిమని వ్యాఖ్యానించాడు.
మరోపక్క తెలుగుదేశం నాయకులు అసలు అవార్డులే ఇవ్వని కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా, కళాకారులను ప్రోత్సహించాలని అవార్డులను ఇచ్చిన తమను ఇలా బజారుకీడ్చడం ఏమిటని? ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇకనుంచైనా చంద్రబాబు చెప్పినట్లు ప్రజాభిప్రాయ సేకరణ, సర్వేల ద్వారా అవార్డులు ఇస్తారని భావిద్దాం. మొత్తానికి చంద్రబాబు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు.