సినిమాలలో సినిమా టిక్ ఎమోషన్స్ ఉంటాయి. తన తల్లిదండ్రులు, లేదా అక్కా తమ్ముడు, స్నేహితుల కోరిక తీర్చడం కోసం హీరో ఎంతో కష్టపడి, ప్రాణాన్ని లెక్కచేయకుండా ఫీట్లు చేస్తాడు. నా అనుకున్న వారి కోసం ప్రేమను కూడా త్యాగం చేస్తూ ఉంటారు. ఇవ్వన్నీ రీల్ సీన్ ఎమోషన్స్. కానీ దర్శకుడు బాబి విషయంలో రీల్ సీన్ కంటే రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటన ఇంకా ఆసక్తికరంగా ఉంది. చిరంజీవితో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని బాబి గుర్తుచేసుకున్నాడు. చిరంజీవి చిత్రం విడుదలైతే ముందుగా వాళ్ల నాన్నే ఆ చిత్రాన్ని చూసేందుకు రెడీ అయిపోయేవాడట. ఆయన వీధి చివర నుంచొని ఉంటే తాను ఇంట్లో స్కూల్‌కని అబద్దం చెప్పి, బ్యాగ్, క్యారేజీ తీసుకుని వీధి చివరికి వెళ్లేవాడట. ఇలా తండ్రి కొడుకులిద్దరు కలిసి చిరంజీవి సినిమాలు చూసే వారంట.
మా నాన్నకు చిరంజీవి అంటే అంత ప్రాణం. ఈ మద్య ఆయనకు ఆరోగ్యం బాగా లేదు. దాంతో మా నాన్న నన్ను పిలిచి, ఏరా.. నీకు ఎన్నో చిరంజీవి సినిమాలు చూపించాను. నాకు ఒక్కసారైనా చిరంజీవిని స్వయంగా చూపించరా అని కోరాడు. దాంతో నాకు చాలా బాధవేసింది. వెంటనే వినాయక్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాను. దానికి వినాయక్ మరో అరగంటలో చిరంజీవినే మీ ఇంటికి వస్తానని చెప్పమన్నారని చెప్పాడు. అయితే సడన్‌గా చిరంజీవి మా ఇంటికి వస్తే ఆ సంతోషంలో ఆరోగ్యం బాగా లేని మా నాన్నకు ఏమైనా అవుతుందేమో అని కలవరపడి వద్దు సార్.. మేమే ఆయనింటికి వస్తాం అని చెప్పాను. అయినా చిరంజీవి గారు ఒప్పుకోలేదు.
'జై లవ కుశ' విడుదల రోజున ఆయన మా ఇంటికి వచ్చి రెండు గంటల సేపు మాతో గడిపారు. నా జీవితంలో నేను మా నాన్నకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది అని చెప్పుకొచ్చాడు బాబీ. మరోవైపు తనను 'గంగోత్రి' చిత్రంలో అల్లుఅర్జున్ ఫ్రెండ్స్‌లో ఒకరిగా చాన్స్ వచ్చింది. కానీ చొక్కా నిక్కర్ వేయాలని చెప్పారు. మూడో తరగతి నుంచి ప్యాంట్లు వేసిన నేను చేయనని వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు.