సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల.... ఇలా కాదేదీ కవితకనర్హం అని మహాకవి చెప్పారు. ఈ విషయంలో రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే కాదేదీ సెటైర్‌కి అనర్హం అనాల్సి వస్తుందేమో? ఆయన కావాలని సెటైర్ వేసినా, మామూలుగా స్పందించినా అది ఆటోమేటిగ్గా ఓ వార్త అయి వివాదం రూపంలోకి మారుతుంది. వర్మ అంటేనే వివాదం.. వివాదం అంటే కేరాఫ్ అడ్రస్ వర్మ అనే చెప్పాలి. ఇక మన పెద్దలు మాతృదేవోభవ:, పితృదేవోభవ:, ఆచార్య దేవో భవ:, అతిథి దేవో భవ: అని కూడాచెప్పారు. ఇక ఇవేమీ వర్మకి మాత్రం మినహాయింపే. కాగా ఏదో మూడు దశాబ్దాలకు ఒకసారి తనకు సెంటిమెంట్ వస్తుందని, 'శివ' చిత్రానికి తన తండ్రి క్లాప్ కొట్టాడని, తాజాగా నాగార్జున చిత్రానికి తన తల్లి చేత క్లాప్ కొట్టిస్తానని చెప్పి, తల్లిదండ్రుల విషయంలో మాత్రం తనకు కాస్త సెంటిమెంట్ ఉందనే నిరూపించాడు.
ఇక ఆయన భార్యని పట్టించుకోడు. భార్య, కూతురి సంగతి అడిగితే నాకు ఎమోషన్స్ లేవు అంటాడు. ఎప్పుడో హైదరాబాద్‌కి వస్తే ఏదో ఒకప్పుడు భార్యని పలకరిస్తానని, ఇక తన కూతురు ఏం చదివిందో కూడా తనకు తెలియదని చెప్పాడు. తాను తన కూతురి పెళ్లిలో కూడా వేదికపై లేకుండా గుంపులో గోవిందలా ఉన్నానని తెలిపాడు. తన కూతురు జిమ్ వర్క్‌ట్స్ చేస్తున్న ఫొటోలను తన తండ్రి వర్మకి పోస్ట్ చేస్తే ఆయన వాటిని సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఆయన కూతురు నా ప్రైవసీకి ఇబ్బంది కదా.. అని తిడితే నా సంగతి తెలిసి కూడా నువ్వు ఆ ఫోటోలు పంపడం ఎందుకు? అని ప్రశ్నించాడు.
ఇక తాజాగా అమెరికా-భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గారాల కూతురు ఇవాంకా హాజరుకానుంది. ఈ సదస్సుకి హైదరాబాద్ వేదిక కానుంది. కాగా ఇవాంకాని కూడా వర్మ వదిలిపెట్టలేదు. 'నాకు రాజకీయాలపై అవగాహన లేదు. ఇంతకీ ఇవాంకా హైదరాబాద్‌కి ఎందుకు వస్తోంది? అయినా ఆమె అందాలను చూడాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది. నాడు సన్నిలియోన్ ఇండియాకి వచ్చినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో.. ఇప్పుడు కూడా ఇవాంకా అందాలను చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను' అంటూ ఓ పోర్న్‌స్టార్‌తో అమెరికా అధ్యక్షుడి కూతురిని పోల్చి తన బుద్ది అంతేనని నిరూపించుకున్నాడు.