సంక్రాంతి, దసరా, వేసవి వంటి సెలవులన్నీ ఒకేసారి ఎలా ఉంటుందో ప్రస్తుతం ఓ ఇద్దరు స్టార్స్ అభిమానులకు అలాగే ఉండనుందని తెలుస్తోంది. ఇక విషయానికి వస్తే నందమూరి, మెగాఫ్యామిలీల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను పక్కనపెడితే నందమూరి, మెగాభిమానులు మాత్రం తూర్పుపడమరలే అన్న సంగతి తెలిసిందే. వీరి మధ్య వాగ్యుద్దాలు, పోటా పోటీ కామెంట్స్, రికార్డ్సు వంటి వారి మధ్య ప్రతిసారి వాదోపవాదాల నుంచి చంపుకునేంతగా ఉంటాయి. ఇక బాలీవుడ్ చిత్రాలు చూసే వారికి వారు తమ స్థాయి హీరోలతోనే కలిసి మల్టీస్టారర్స్ చేస్తున్నారు కదా..! మరి మన హీరోలకేమైంది? అని బాధపడుతూ ఉంటారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి రోజుల్లో తప్ప ఈ రోజుల్లో నిజమైన మల్టీస్టారర్స్ లేవు. ఓ సీనియర్ స్టార్ ఓ యంగ్ స్టార్ నటిస్తే వాటినే మల్టీస్టారర్స్‌గా అనుకుని తృప్తి పడుతున్నాం. కానీ ఈ తరంలో ఓపెను సంచలనానికి రాజమౌళి నాంది పలకనున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది.
తాజాగా తాను 'బాహుబలి'కి నంది అవార్డు పొందిన సందర్భంగా రాజమౌళి అటు పక్క రామ్‌చరణ్, ఇటు పక్క ఎన్టీఆర్‌లతో దిగిన ఫొటోని తన ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టి 'మీ ఊహకే వదిలేస్తున్నా' అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరు నటించనున్నారనే విషయంపై వార్తలు వస్తున్నాయి. దానికి రాజమౌళి కూడా తన వంతుగా హింట్ అందించాడని భావిస్తున్నారు. ఇక గతంలో ఎన్టీఆర్‌తో రాజమౌళి 'స్టూడెంట్ నెంబర్1, సింహాద్రి, యమదొంగ' వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చాడు. ఇందులో 'సింహాద్రి' అయితే నాడు రికార్డులను బద్దలు కొట్టింది. ఇక రాజమౌళి ఇప్పటికి రామ్‌చరణ్‌తో 'మగధీర' అనే ఇండస్ట్రీ హిట్‌ని ఇచ్చాడు. మరి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు విడివిడిగా సోలోగా నటించే చిత్రాలే రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
మరి ఈ ఇద్దరు కలిసి, డ్యాన్స్‌లు, ఫైట్స్, డైలాగులతో ఓకే ఫ్రేమ్‌లో రెచ్చిపోతుంటే అంతకు మించి తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది ఏమీ లేదు.. ఇలాంటి చిత్రాల ద్వారా మన సినిమా పరిధిని మరింత పెంచుకోవడమే కాదు.. హీరోల అభిమానుల మధ్య కూడా సయోధ్య సాధ్యమవుతుంది. ఇక ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే తీస్తాడా? లేక రామ్‌చరణ్ ఆల్‌రెడీ 'జంజీర్'లో నటించాడు. ఎన్టీఆర్ చిత్రాలు హిందీ శాటిలైట్, డిజిటల్ సినిమాల ద్వారా నార్త్‌లో కూడా ఫేమసే. మరి ఈ చిత్రంతో రామ్‌చరణ్‌ని మరలా బాలీవుడ్‌లో రీలాంచ్ చేసి, ఎన్టీఆర్‌ను నేరుగా హిందీ పరిశ్రమకు పరిచయం చేస్తాడా? అనేది వేచిచూడాల్సిన విషయం.