నందిఅవార్డులు ఏ ఏడాదికి ఆ ఏడాది ఇస్తే పెద్దగా సమస్యలు రావు. కానీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత మూడేళ్లకు ఒకేసారి నంది అవార్డులను ప్రకటించడంతోనే ఈసారి వివాదాలు ఎక్కువై, చినికి చినికి గాలి వానలో మారుతున్నాయనేది వాస్తవం. ఇక కేవలం మంచి చిత్రాలు, అవార్డుల చిత్రాలకే అవార్డులిస్తే ఆ అవార్డు గ్రహీతలు తప్ప స్టార్స్ ఎవ్వరూ ఆ వేడుకలకు అటెండ్ కావడం లేదు. దీంతో కమర్షియల్ హీరోలకి, మాస్ యాక్షన్ వంటి చిత్రాలకు, స్టార్స్‌కి అవార్డులిస్తున్నారని, దీనివల్ల ఈ అవార్డులకి పబ్లిసిటీ వచ్చి ప్రభుత్వాలకు మేలు చేస్తాయనే ధోరణి పెరిగిపోయింది అనేది మాత్రం వాస్తవం. ఇక సినిమా అవార్డుల విషయంలో అందరినీ బాధిస్తున్నవి మూడు అంశాలే. ఏయన్నార్‌కి చివరి చిత్రమైన 'మనం'కి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, 'రుద్రమదేవి' విషయంలోనే నిజమైన సినీ ప్రేమికులు బాధపడుతున్నారు.
ఇక 'లెజెండ్' సినిమాకి అన్ని అవార్డులివ్వడం కూడా చర్చనీయాంశం అయింది. ఇక్కడే అందరూ సైకిల్ అవార్డ్సు అని, కమ్మ అవార్డు అని విమర్శిస్తున్నారు. 'లెజెండ్' విషయంలో కూడా ఉత్తమనటుడిగా బాలకృష్ణకి, దర్శకునిగా బోయపాటి శ్రీనుకి ఇస్తే ఫర్వాలేదు. పక్కా కమర్షియల్ చిత్రమైన హింసాత్మకంగా ఉండే ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు రావడమే వివాదాలకు అసలు కారణం. ఇక ఎవరైనా ఈ నంది అవార్డులను విమర్శిస్తే మూడేళ్ల పాటు బహిష్కరిస్తామని ఏపీ ప్రభుత్వం బెదిరించడమే కాదు. ఇలా గోల జరిగితే అసలు అవార్డులనే తీసివేస్తామని బెదిరించడం సమంజసం కాదు. ఏదో గుర్తింపును ఇద్దామని అవార్డులు ఇస్తుంటే మీ గోల చూస్తే ఇక అవార్డులను ఇవ్వకూడదని అనిపిస్తోందని ప్రభుత్వం బెదిరిస్తోంది. ఇది సమంజసం కాదు.
ఇక అదే రాష్ట్రం విడిపోకుండా, ఇంకా తెలంగాణ ఉద్యమమే జరుగుతూ ఉంటే 'రుద్రమదేవి' విషయంలో తెలంగాణ అంతా అట్టుడికిపోయేది. కొంతలో కొంత ఇది మేలు. ఇక ప్రభుత్వం వాదన ఏమిటంటే.. హైదరాబాద్‌లోనే ఉంటూ, తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు కడుతున్న వారికి ఎందుకు అవార్డులివ్వాలి? ఈసారి అవార్డులు గెలుచుకున్న వారిలో అత్యధికులకు ఏపీలో ఓటు హక్కు కూడా లేదని వాదిస్తోంది. ఈ వాదన బాగానే ఉంది. కానీ దానిని సామరస్యంగా చెప్పాలే గానీ బెదిరించే ధోరణి తప్పు.