బాలకృష్ణ సినిమాలలో అనర్గళంగా పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో దిట్టే గానీ ఓపెన్ స్పీచ్‌లో మాత్రం ఆయన మాటలకు అర్ధాలు వెత్తుక్కోవడం కష్టమవుతుంది. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా మూడేళ్లకి కలిపి ఇచ్చిన నంది అవార్డులపై పెనుదుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రికి వియ్యంకుడు, మంత్రి లోకేష్ మావ అయిన బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రానికి ఏకంగా తొమ్మిది అవార్డులు రావడంపై పెనుదుమారం రేగుతోంది. కావాలనే బాలయ్య సినిమాకి అన్ని అవార్డులు ఇచ్చారని, కమ్మ లాబీయింగ్ పనిచేసిందని వస్తున్న విమర్శలపై తాజాగా బాలకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ని స్థాపించి 20ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పలు వేడుకలకు, రక్తదాన శిబిరానికి ఆయన వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నంది అవార్డులు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు, ఎప్పుడు అవార్డ్సు ఇచ్చినా ఏవో విమర్శలు, చర్చలు, వివిదాలు వస్తూనే ఉంటాయని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత తన చిత్రానికి గురించి వచ్చిన అవార్డులపై స్పందిస్తూ 'ఇది మా సమిష్టికృషి, మాటల ద్వారా కాదు చేతల దాకా చూపించిన చిత్రం లెజెండ్. అసలు లెజెండ్ అనే టైటిలే ఎంతో పవర్‌ఫుల్. లెజెండ్‌పై నాడు విడుదలప్పుడు కూడా పలు వివాదాలు వచ్చాయని' చెప్పాడు. అసలు ఏ సినిమా సక్సెస్ అయినా కూడా అది సమష్టికృషి వల్లనే సాధ్యం. అది 'లెజెండ్' అయినా 'రేసు గుర్రం' అయినా కూడా శ్రమ, డబ్బు ఒక్కటే.
కానీ 'లెజెండ్' టైటిల్ సామాన్యమైన విషయం కాదని, అది ఎంతో పవర్‌పుల్ అని చెప్పడం కామెడీ చేయడమే. అంటే టైటిల్‌లోని పవర్‌ని చూసి కూడా అవార్డులిస్తారా? ఏంటి? బాలయ్యా..! ఇక ఆయన నంది అవార్డులను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞతలను తెలిపాడు. దానిపై మాత్రం నీకు అవార్డులను ఇచ్చుకున్న నీకు నీవే కృతజ్ఞతలు చెప్పుకోవాలి గానీ వేరేవారికి కృతజ్ఞతలు చెప్పడం దేనికి అని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఇదేవేడుకకు వచ్చిన బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి లోకేష్ రక్తదాన శిబిరంలో పాల్గొని తన తండ్రికి అవార్డు రావడం సంతోషకరమని, కానీ దీనిపై వస్తున్న విమర్శలపై స్పందించడానికి ఇది సరైన సమయం, సరైన వేదిక కూడా కాదని హుందాగా మాట్లాడింది..!