గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంతా నంది అవార్డుల గురించే మాట్లాడుకుంటుంది. 2014,15 ,16 నంది అవార్డుల ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతుంది. మరోపక్క ఈ వారం విడుదలైన చిన్న పెద్ద సినిమాల రచ్చ. దాదాపు 9 సినిమాలు విడుదలైతే అందులో రెండు బావున్నాయి మిగతావన్నీ ఫాట్ అనే రేంజ్ లో సోషల్ మీడియాలో కథనాలు కథనాలు ప్రసారం అవుతూ... టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తన్యూస్ అనేదే లేకుండా పోయింది. అలాంటి టైం లో టాలీవుడ్ దర్శకధీర రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోని అప్లోడ్ చేశాడు. రాజమౌళి అలా ఆ పిక్ ని పోస్ట్ చేశాడో లేదో ఆ పిక్ ఇలా టాప్ ట్రేండింగ్ అయ్యింది.
మరి అంతలా జనాలని విపరీతంగా ఆకర్షించిన ఆ ఫోటో ఏదనుకుంటున్నారా... రాజమౌళి తన దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ చిత్రాలతో స్టార్ డమ్ ని కట్టబెట్టిన ఎన్టీఆర్ తో, మగధీర తో ఇండస్ట్రీ హిట్ అందించి స్టార్ హీరో రేంజ్ కి చేర్చిన రామ్ చరణ్ తో కలిసి ఒక అద్భుతమైన ఫోటో దిగాడు. ఆ ఫోటో చూస్తుంటే అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. రాజమౌళి తో ఎన్టీఆర్ కున్న సన్నిహిత సంబంధాలు అందరికి తెలిసినవే. అలాగే రామ్ చరణ్ తోనూ రాజమౌళి అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. అలాంటి వారిద్దరితో చూడడానికి రెండు కళ్ళు చాలవనిపించే సూపర్ ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి టాలీవుడ్ ప్రేక్షకులు మొత్తం సూపర్ సర్ప్రైజ్ అయ్యారు. ఇక ఈ ఫోటో పట్టుకుని ఎవరికి తోచింది వారు ఊహించేసుకుంటూ కథనాలు కథనాలు సృష్టించేస్తున్నారు.
అయితే రాజమౌళి బాహుబలి తర్వాత చేయబోయే సినిమా ఏంటి? అనే దాని మీద టాలీవుడే కాదు, బాలీవుడ్ కూడా రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలు ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడు? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఊహగానాలకు ఎన్టీఆర్, రాంచరణ్‌తో రాజమౌళి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నాడని.. వారితో కలిసి దిగిన ఈ ఫోటోతో రాజమౌళి పుల్‌స్టాప్ పెట్టేశాడా?. మరోపక్క ఎన్టీఆర్ హీరోగా రాంచరణ్ నిర్మాతగా సినిమా ఉంటుందని మరో మాట విన్పిస్తోంది. వీటిలో ఏది నిజం అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజమౌళి సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మెగా హీరో రాంచరణ్ తో చేసిన మగధీర బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మరి నిజంగా ఈ ఫొటో చెప్పిందే నిజమైతే… అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు పండగ చేసుకునే రోజులు వచ్చాయి.