ఇటు అవకాశవాదం, కుల రాజకీయాలు చేసే సి.కళ్యాణ్, బండ్లగణేష్ వంటి వారి విమర్శలకు పెద్దగా విలువ లేకపోయినా న్యూట్రల్‌గా ఉండే ఆర్.నారాయణ మూర్తి నుంచి శివాజీ వరకు అందరూ ఈ అవార్డులపై మండిపడుతున్నారు. ఇక ఈ లిస్ట్‌లోకి సీనియర్ నిర్మాత చంటి అడ్డాల కూడా చేరాడు. ఆయన మాట్లాడుతూ, అవార్డులని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విధానం, జ్యూరీ సభ్యుల తంతు చూస్తుంటే వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంది. మంచి సినిమాలకు అన్యాయం జరిగిందనే బాధ ఉంది. మూడేళ్ల నంది అవార్డుల ఎంపిక చూస్తే ముందుగానే అవార్డులని నిర్ణయించేసి ముఖ్యమంత్రి చేత సంతకం పెట్టించినట్లుగా ఉంది. సినిమాలకు అవార్డులు రావాలంటే జ్యూరీలో తెలిసిన వ్యక్తులు, ప్రభుత్వంతో పరిచయాలు, రికమండేషన్లు వంటివి కావాలేమో అనిపిస్తోంది.
'మనం' వంటి క్లాసిక్‌కి, 'రుద్రమదేవి' వంటి హిస్టారికల్ చిత్రానికి, పెద్ద కమర్షియల్ విజయం సాధించిన 'రేసుగుర్రం'కి ఈ అవార్డులలో స్థానం లేకపోవడం బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో మంచి చిత్రాలను తీయాలని ఎవరు మాత్రం ఎందుకు అనుకుంటారు? ఇకపైన ఇలా సాగితే నంది అవార్డులను పట్టించుకోకపోవడం మంచిది, నేను 'ప్రేమ' చిత్రం చేసిన సమయంలో కెమెరామెన్ ఎస్.గోపాల్‌రెడ్డిగారు ఫోన్ చేసి మన చిత్రానికి అవార్డు వచ్చిందని చెప్పారు. కానీ మరునాడు లిస్ట్‌లో ఆ చిత్రం పేరు కనిపించలేదు. మరో రికమండేషన్ చిత్రం ఉండటంతో నా చిత్రాన్ని పక్కనపెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆర్.నారాయణమూర్తి 'రుద్రమదేవి'కి అవార్డు ఇవ్వకుండా 'బాహుబలి'కి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఒకప్పుడు సంప్రదాయాలు, సంస్కృతులు, కుటుంబ వ్యవస్థ, సమాజాన్ని ఆలోచింప చేసే చిత్రాలకు అవార్డులు ఇచ్చారు. కానీ ఇప్పుడలా లేదని చెప్పాడు.
ఇక హీరో శివాజీ మాట్లాడుతూ, గతంలో నాకు కూడా అన్యాయం జరిగింది. నేను చేసిన 'మిస్సమ్మ' చిత్రానికి ఎన్నో ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా ఆకట్టుకుది. నాటి కమిటీలో 90శాతం మంది మాకు అవార్డు ఇవ్వాలని భావిస్తే 10శాతం మంది లాబీయింగ్‌కి తలొగ్గి ఆ అవార్డును రాకుండా చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి వారికే ఇస్తున్నారు. అది టిడిపి కావచ్చు.వైసీపీ, బిజెపి.. ఇలా అన్ని పార్టీలు అదే చేస్తున్నాయని, కమిటీ మెంబర్లుగా ఎంపిక చేసిన వారిని చూస్తేనే ఆ అవార్డులు ఎవరికి వస్తాయో? సులభంగా అర్ధమవుతుందన్నాడు. నిజమే నేడు పద్మ అవార్డులు దాదా సాహెబ్ ఫాల్కే, జాతీయ అవార్డులలో కూడా అదే జరుగుతోందనే మాట వాస్తవం.