తాజాగా నంది అవార్డ్సుపై తన అభిప్రాయాలను తెలిపిన వర్మని మద్దినేని రమేష్ బఫూన్లు, బలుపు గాళ్లు, నంది అవార్డులపై మాట్లాడితే ఖబడ్దార్... అంటూ తీవ్ర పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగిన మద్దినేనిపై వర్మ తనదైన స్టైల్‌లో స్పందించాడు. నాటి 'చాణక్యచంద్రగుప్త'లోని జయమాలిని పాటను నంది అవార్డుకి అన్వయిస్తూ పేరడీ వంటి పాటతో మద్దినేనికి అబ్బా.. అనిపించాడు. ఈ పాటలోని ఒకటా రెండా .. తొమ్మిది...అంటూ సాగే డ్యాన్స్ విజువల్‌కి తన రీమిక్స్‌ని జోడించాడు. 'ఇష్టమొచ్చినట్లు పంచుకోవడం మాకు ఇష్టం....మేము చెప్పినట్లు తలవూపు నంది.. ఇంకెందుకు నందులు ఎందుకో.... అంకెలు చూస్తే తొమ్మిది...మా కోరిక మాత్రం 'కమ్మది' అంటూ పాటను ఓ ఊపు ఊపాడు. గంగిెరెద్దులాగా నన్ను చూడకండి..అక్కడక్కడే తిప్పకండి...అడ్డువచ్చేవారు లేరు మాకు...'పచ్చజెండా' ఊపుతాము మేము' అంటు నంది పాడుతున్నట్లుగా తీసిన దీనిని చూసి వర్మకి హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఇక ఆయన ఇంతకు ముందు సునీల్ హీరోగా తీసిన 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అపల్రాజు' చిత్రంలో నందులను గుర్రం అవార్డు అని పిలిచి వాటిని ఎవరు ఎవరికి ఎందుకిస్తారో కూడా తెలియదని సెటైర్ వేశాడు. నిజానికి వర్మ వివాదాస్పద దర్శకుడే కావచ్చు. కానీ ఆయన క్రియేటివిటీని ఎవ్వరు తప్పుపట్టలేరు. ఇక ఆయన మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లపైనే కాదు. బాలయ్య, చంద్రబాబు, కేసీఆర్, ట్రంప్ ఇలా ఎవరినైనా తనదైన భావాలతో స్పందిస్తాడు. ఆయన మాట్లాడే అతి మాటలు, కుటుంబం మీద, సమాజం మీద నమ్మకం లేదని ఓపెన్‌గా చెప్పే ఆయన కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నేడు ప్రతి ఒక్కరిలోనూ ఇదే భావన అంతర్లీనంగా ఉంది. కానీ బయటికి బాధ్యత, సమాజం, కుటుంబ విలువలు అంటూ నీతులు వల్లెవేస్తారు గానీ తాము బాగుంటే చాలు.. సమాజం ఎటుపోతే నాకేంటి.. నా సంగతేంటి? అనే స్వార్ధం అందరిలోనూ అంతర్లీనంగా ఉంటోంది. అదే విషయాన్ని వర్మ నిజాయితీగా ఒప్పుకుంటాడు.
ఇక ఎందరో పెద్ద మనుషులు తెరవెనుక రంకు చేస్తూ, బయటికి మాత్రం నీతులు చెప్పేవారికంటే... ఎవరైనా ఆడవాళ్లు నాకు ఇష్టమైతే వెంటనే నేను డైరెక్ట్‌గా అడిగేస్తాను అని చెప్పే ఆయన్ను విమర్శించే వారు అవకాశం కోసం గోతి కాడి నక్కల్లా, కాస్టింగ్ కౌచ్ చేసేవారే ఎక్కువమంది అంటున్నారు. మొత్తానికి అటు మెగాఫ్యామిలీపై, ఇటు నందమూరి, చంద్రబాబులపై కూడా గళమెత్తిన ఆయన తనకు కులం, మతం అనేది నచ్చవని చెప్పేమాట మాత్రం వాస్తవం..!