నంది అవార్డులపై ఈ ఏడాది జరిగినంత రచ్చ ఎప్పుడు జరగలేదు. ఇక ఈ వివాదాలకు కారణం మాత్రం బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రానికి అన్ని అవార్డులు దక్కడమే. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా రాని వ్యతిరేకత బాలయ్య విషయంలో వస్తోంది. ఇక తాము తీసిన 'రేసుగుర్రం' చిత్రం అతి పెద్ద విజయం సాధించిందని, 100కోట్లు కొల్లగొట్టిన తమ చిత్రంలో హీరో గా నటించిన బన్నీకి ఉత్తమనటుడు అవార్డు వస్తుందనుకుంటే అది కూడా దక్కలేదని నల్లమలుపు బుజ్జి ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టాడు. మరోవైపు తాను ఎంతో కష్టపడి తీసిన హిస్టారికల్ మూవీకి ఏపీ ప్రభుత్వం పన్నురాయితీతో పాటు అవార్డు కూడా ఇవ్వలేదని, అదేమంటే వార్నింగ్ ఇస్తున్నారని ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో పాటు ప్రెస్‌మీట్ కూడా పెట్టి తన స్వరం వినిపించాడు గుణశేఖర్.
ఇక 'రేసుగుర్రం' నిజంగానే 'లెజెండ్'లా ఓ కమర్షియల్ చిత్రమే కాబట్టి దానికి అవార్డు ఇవ్వలేదని భావించవచ్చు. కానీ అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా, క్లాసిక్ మూవీగా, అద్భుతమైన కథ, ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లేలతో వచ్చి ఆబాలగోపాలాన్ని అలరించిన 'మనం' వంటి చిత్రం మొదటి స్థానంలో నిలవక పోవడం దారుణమనే చెప్పాలి. ఇక ఈ విషయంలో నంది అవార్డుల కమిటీలో ఉన్న ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, 'లెజెండ్' చిత్రానికి అన్ని అవార్డులు ఇవ్వడంపై వస్తున్న విమర్శలకు అర్ధమేలేదు. ఈ చిత్రంలో అంతర్లీనంగా ఓ సందేశం ఉంది. భ్రూణ హత్యలతో పాటు మహిళల గొప్పతనం, పార్టీలు మార్చే నాయకులపై కూడా మంచి సందేశం ఇచ్చారని చెప్పాడు.
ఇక 'మనం' చిత్రానికి అవార్డు రాకపోవడానికి ఆ చిత్రం పునర్జన్మల నేపధ్యంలో రూపొందిన చిత్రం కావడంతో, మూడనమ్మకాలకు అవార్డులు ఇవ్వకూడదనే నిర్ణయంతోనే ఆ స్థానం 'మనం'కి ఇవ్వలేదని చెప్పాడు. మరి 'మనం' చిత్రం పునర్జన్మల గురించే అయితే 'మూగమనసులు' నుండి 'జానకిరాముడు' వరకు అలా వచ్చిన చిత్రాలు ఎన్నో రికార్డులను సృష్టించాయి. మరి 'ఈగ' చిత్రం కూడా పునర్జన్మల ఆధారంగా రూపొందిన చిత్రం కాదా? అనేది పలువురు లేవనెత్తుతున్న అంశం. అసలు అవార్డులనిచ్చిన ఏపీ ప్రభుత్వంలో పార్టీలకు అమ్ముడు పోయిన వారు లేరా? అనేది మరో ప్రశ్న.