చాలా కాలం కిందట వర్మ.. మెగాస్టార్ చిరంజీవిని నిజంగానే పొగిడాడు. దాంతో అనందపడే లోపే మెగా ఫ్యామిలీ పై వెంటనే సెటైర్స్‌వేశాడు. ఇక పవన్‌పై పాజిటివ్ కామెంట్స్ చేస్తూ.. ఆయన రాజకీయాలలోకి రావాలని గళమెత్తింది కూడా వర్మనే. ఆ తర్వాత ఆయన పవన్‌తో చెడుగుడు ఆడుకున్నాడు. ఇక ఈ సారి నందమూరి హీరోల వంతు వచ్చింది. ఇటీవలే తన శిష్యుడు పూరీజగన్నాథ్ చిత్రం 'పైసా వసూల్' విడుదలైన సందర్భంగా మైండ్ బ్లోయింగ్ అన్నాడు. అంతకు ముందు బాలయ్య 100 చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి'ని ఆకాశానికి ఎత్తేస్తూ 'ఖైదీనెంబర్ 150 ' పై సెటైర్లు వేశాడు.
ప్రస్తుతం ఆయన తాజాగా బాలయ్యకు 'లెజెండ్' అవార్డులపై గందరగోళం నెలకొన్న నేపధ్యంలో ఆయన ఈసారి బాలయ్య, బోయపాటి, నంది అవార్డు కమిటీపై సెటైర్లు వేశాడు. ఈ అవార్డుల లిస్ట్‌నంతా ఇప్పుడే చూశానని.. నిజంగా ఇంత నిజాయితీగా 1% కూడా పక్షపాతం లేకుండా అవార్డులు ఇచ్చింది ఈ కమిటీనే అని చెప్పిన ఆయన.. ఈ అవార్డులను ఎంపిక చేసిన వారికి ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని, ఇలాంటి అవార్డుల ఎన్నిక ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని దెప్పిపొడిచాడు. ఇక బాలయ్య 'లెజెండ్'కి వచ్చినన్ని అవార్డులను చూసి అందరూ జెలసీగా ఫీలవుతున్నారని, నిజానికి ఈ నంది అవార్డుల ఎంపిక చూసిన 'టైటానిక్' డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ తనకు వచ్చిన 11 ఆస్కార్ అవార్డులని 'లెజెండ్' చిత్ర దర్శకుని కాళ్ల వద్ద పెట్టి నమస్కరిస్తాడు.. అంటూ సెటైరికల్ పంచ్‌లను వేశాడు.
ఇక ఈ చిత్రం విషయంలో కమ్మ లాబీ జరిగిందని కొందరు అంటుంటే, బాలయ్య అభిమానులు మాత్రం తానేమీ రికమెండ్ చేసి నంది అవార్డులను తెప్పించుకోలేదని, తన తండ్రి ఎన్టీఆర్‌తో సహా గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన పలు చిత్రాలకు అవార్డులు రాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరికొందరేమో ఈ అవార్డు కమిటీలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లుఅరవింద్ కూడా భాగస్వామ్యుడే కదా...! మరి ఈ అవార్డులను ఆయన ఎందుకు వ్యతిరేకించలేదు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో వర్మ చేసిన కామెంట్స్ వీటికి మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది. బహుశా వర్మ ఉద్దేశ్యంలో తనకు దగ్గరైన నాగార్జున 'మనం'కి సముచిత స్థానం ఇవ్వలేదనే కోపం ఉండి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.