ప్రేక్షకుల ఆదరణ తప్ప నంది అవార్డుల వంటివి తాను పట్టించుకోనని, అవి నంది అవార్డులు కాదు పంది అవార్డులని ఒకసారి బాలయ్య చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా అవార్డులను తన వెంట్రుకతో పోల్చాడు. ఇక బాలకృష్ణకి 'నరసింహనాయుడు, సింహా', తాజాగా 'లెజెండ్'తో ఉత్తమ నటుని అవార్డు వచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కి 'ఆది' చిత్రంలోనే స్పెషల్ జ్యూరీ నంది అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయనకు తాజాగా 'నాన్నకు ప్రేమతో' చిత్రం ద్వారా ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది.
ఇక తాజాగా ఈ విషయమై నందమూరి కళ్యాణ్‌రామ్ స్పందిస్తూ, 2014కిగాను బాబాయ్‌కి 'లెజెండ్' చిత్రం ద్వారా ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. మరోవైపు 2016కిగాను తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌కి 'నాన్నకు ప్రేమతో'కి ఉత్తమ నటుడి అవార్డు లభించింది. బాబాయ్, తారక్‌లకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. నందమూరి కుటుంబంలోకి మరో రెండు నంది అవార్డులు వచ్చి చేరడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ సారి అవార్డు సభ్యులు దాదాపు అన్ని ఫ్యామిలీల హీరోలను, దర్శకులను దృష్టిలో పెట్టుకుని ఏ వివాదాలకు తావివ్వకుండా ఎంపిక చేశామని చెప్పుకుంటున్నారు. కానీ రుద్రమదేవి, మెగా ఫ్యామిలీ హీరోలకి అన్యాయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతుండటంతో మరోసారి ఈ నంది అవార్డ్స్ సెన్సేషన్ అవుతున్నాయి.