పోయిన ఆగష్టు లో ఏకధాటిగా చిన్న పెద్ద సినిమాలు వరసబెట్టి విడుదలయ్యాయి. ఆ నెల మొత్తం సినిమాల జాతరలా వుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆగష్టు నెలనే తలపించేలా నవంబర్ నెలలో కూడా లెక్కకు మించి సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు, తమిళ సినిమాలతో థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. వారానికి అరడజను సినిమాలన్నట్టు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిపి థియేటర్స్ లోకి ఓచేస్తుంటే ... థియేటర్స్ ఖాళీగా ఉండడం లేదు.
ఇకపోతే గత శుక్రవారం దాదాపు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే ఈ వారం ఏకంగా 10 నుండి 14 సినిమాలు విడుదలవుతున్నాయనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. షూటింగ్ లు పూర్తి చేసుకుని ఎప్పుడు విడుదల చెయ్యాలో తెలియక సతమతమవుతున్న దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఇప్పుడు ఈవారమే విడుదలకు సిద్ధం చేశారు. అయితే ఈ 10 నుండి 14 సినిమాల్లో కొన్ని సినిమాల పేర్లు కూడా ప్రేక్షకులకు తెలియవు. అందులో నటించిన నటీనటుల వివరాలు ఆ దేవుడికే తెలియాలి అన్నట్టు వుంది విషయం. అసలా సినిమాలు ఎప్పుడు తెరకెక్కినవో... అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు.
ఇక ఈ సినిమాల్లో కొన్ని స్ట్రయిట్ సినిమాలు కాగా రెండు మూడు డబ్బింగ్ సినిమాలున్నాయి. కార్తీ - రకుల్ జంటగా నటించిన ఖాకి, సిద్దార్థ్ గృహం సినిమాలే ప్రేక్షకులకు కాస్త ఇంట్రెస్ట్ కలిగించే సినిమాలు. ఇకపోతే తెలుగులో శివబాలాజీ - రాజీవ్ కనకాల స్నేహమేరా జీవితం, ప్రేమతో మీ కార్తీక్, స్వాతి నటించిన లండన్ బాబులు, లవర్స్ క్లబ్, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, రా.. రా, దేవి శ్రీ ప్రసాద్ వంటి సినిమాలున్నాయి. మరి ఈ సినిమాలన్నిటిలో రెండు మూడు సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మిగిలిన సినిమాలన్నీ అలా వచ్చి ఇలా సర్దుకుపోవాల్సిన సినిమాలే ఎక్కువగా వున్నాయి. మొత్తానికి చిన్న పెద్ద సినిమాల జాతర వచ్చే శుక్రవారం ఉంటుంది కాసుకోండి.