నాటి కాలంలో నటునిగా, రచయితగా గొల్లపూడి మారుతీరావుకి ఎంతో పేరుండేది. ఉదాత్తమైన పాత్రలు, 'సంసారం ఓ చదరంగం' వంటి కుటుంబ కథా చిత్రాలు, 'స్వాతిముత్యం'లో రాధికను లోబర్చుకోవాలని కుట్ర చేసే పాత్రలో, ఇంకా కమెడియన్‌గా.. ఇలా ఆయన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. ఇక ఆయన కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ తన మొదటి చిత్రం డైరెక్ట్ చేస్తూనే వైజాగ్‌లో సముద్రంలో షూటింగ్ సందర్భంగా కొట్టుకుని పోయి మరణించాడు. ఈ చిత్రం ద్వారానే తమిళంలో స్టార్ హీరో అజిత్, శ్రీకర్ పేరుతో హీరోగా నటించాడు. ఇక ఈ 'ప్రేమపుస్తకం' షూటింగ్ మద్యలోనే తన కుమారుడు మరణించడంతో ఆ మిగిలిన భాగాన్ని గొల్లపూడినే పూర్తి చేసి విడుదల చేశాడు. తన కుమారుడి పేరున ఆయన గొల్లపూడి శ్రీనివాస్ అనే అవార్డులు కొత్తవారికి ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
జీవితంలో, కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు, సుఖదు:ఖాలు చూసిన ఆయన త్వరలో విడుదల కానున్న 'ప్రేమతో మీ కార్తీక్' అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో తాను హీరోకి తాతయ్యగా చేస్తున్నానని, ఇక హీరోకి తండ్రి కూడా ఉంటాడని, మొత్తంగా మూడు తరాలకు చెందిన వారి మనస్తత్వాలు, భావోద్వేగాలు, వారి ఆలోచనా ధోరణుల మీద ఈ చిత్రం రూపొందని తెలిపాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మా కాలంలో ఈ చిత్రం తీస్తే డబ్బు వస్తుందా? లేదా? అని ఆలోచించే వారం కాదు.
మనసులని హత్తుకునే కథ, సహజమైన కుటుంబాలలో జరిగే సంఘటనతో కూడిన చిత్రాలే చేసేవారం. అలాంటి తరహా కుటుంబంలోని ఎమోషన్స్‌ని తెలిపే చిత్రమే ఈ 'ప్రేమతో మీ కార్తీక్' చిత్రం. ఇక మా కాలంలో ప్రేక్షకులు ఫలానా వారు నటించారా? లేదా? అని తెలుసుకుని సినిమాకి వెళ్లేవారు. నా పాత్ర ఎలా ఉంటుంది అనేది పక్కనపెట్టి గొల్లపూడి ఉంటే చిత్రం చూద్దామని చూసేవారు. కానీ ఇప్పుడలా కాదు కదా..! అందుకే పెద్దగా చిత్రాలు చేయడం లేదు. నాకు సరిపోయే కథలు, నా వయసుకి తగ్గ పాత్రలు వస్తేనే చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.