హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియో అగ్నిప్రమాదానికి గురైంది. ఈరోజు అంటే సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో లో పలు సినిమాలకు సంబందించిన సినిమాల షూటింగ్స్ జరుగుతుంటాయి. ఆయా సినిమాల సెట్టింగ్స్ ఈ స్టూడియోలో వేసి తమ తమ సినిమాల్లోని కీలక సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే స్టూడియోలో వేసిన ఒక సెట్టింగ్‌లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అయితే ఆ అగ్నికీలల్లో ఇప్పటికే ఒక సెట్ దగ్ధమైనట్లు సమాచారం.
అక్కడ అందుబాటులో ఉన్న నీటితో మంటలను ఆర్పేందుకు అన్నపూర్ణ స్టూడియో సిబ్బంది ప్రయతించడమే కాకుండా.... . అగ్నిమాపక దళాలు కూడా అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఒక్కసారిగా స్టూడియో లో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్టూడియో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అయితే ప్రాణ నష్టం ఏం జరగలేదని... కేవలం విలువైన వస్తువులతో సహా అక్కడ వున్న సినిమా సెట్టింగ్ మాత్రమే తగలబడుతున్నట్టుగా సమాచారం అందుతుంది.