'జబర్దస్త్' షోలో వచ్చే జోకర్ వేషాలు, ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా చీప్ కామెడీ స్కిట్‌లపై ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. ఇక తాజాగా హైపర్ ఆది ఈ షోలో 'పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం. అదే ప్రేమ అనేది ముందు పొట్ట వేసుకుని, వెనుక బట్ట వేసుకుని రివ్యూలు రాసింత ఈజీ' అని పంచ్ వేశాడు. వాస్తవానికి ఇది విశ్లేషకులకు, రివ్యూ రైటర్లకు అందరి మీద వేసిన సెటైర్. నిజమే సినిమా తీయడం అనేది జబర్దస్త్ షో తీసినంత కష్టం.. 'ఇక ఎదుటివారిపై బురద జల్లుతూ, వెకిలి హాస్యం పండించడం అనేది హైపర్ ఆది వేసే సెటైర్ అంత ఈజీ'అని చెప్పాల్సివస్తుంది. అయినా అందరు రివ్వ్యూయర్లను ఉద్దేశించి వేసిన ఈ సెటైర్‌పై గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజం తడుముకున్నట్లుగా కత్తిమహేష్ స్పందించాడు.
అవును, నాకు బట్టతల ఉంది.. పొట్ట ఉంది. బట్ట ఉంది. ప్రపంచంలోని అందరూ ఒకేలా ఉండరు. ఒక్కోక్కరు ఒక్కోలా ఉండటమే ప్రపంచం. కాస్త భిన్నంగా ఉన్నంత మాత్రాన జోకర్స్ అయిపోతామా? కొందరు పొడవుగా ఉంటే కొందరు పొట్టిగా ఉంటారు. కొందరు తెల్లగా ఉంటే కొందరు నల్లగా ఉంటారు. కొందరికి నత్తి ఉండవచ్చు. ఎవరి స్టైల్ వారిదే. దిస్ ఈజ్ మై స్టైల్. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. నేను లావుగా ఉన్నానని బాధపడేంత సిల్లీ మెంటాలిటీ నాది కాదు...నేను జబర్దస్త్ షో చూడను. చూసిన ఫ్రెండ్స్ పంపే లింకులను బట్టి తెలుసుకుంటాను. అదేమీ గొప్పషో కాదు.. అందులో కామెడీ ఉంటుందని నేను భావించను.
మనుషుల మీద వారు వేసుకునే బట్టల మీద జోక్స్ వేసుకుని అపహాస్యాన్ని హాస్యం అనుకుంటున్నారు. మన దిగజారుడుతనానికి ఈ షోనే ఉదాహరణగా చెప్పవచ్చు. దానికి ఈ షోసాగుతున్న తీరే నిదర్శనం... అంటూ బాగా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. అయినా జబర్దస్త్‌లో దివ్యాంగులను, స్త్రీలను, గ్రహణం మొర్రి, మరుగుజ్జు, నత్తి.. ఇలాంటి లోపాలను కూడా చూపిస్తూ హాస్యం పండిస్తున్నారనే విషయంలో కత్తి మహేష్ చెప్పింది అక్షరసత్యం. మరి అక్కడి జడ్జిలు కూడా ఇలాంటి కించపరిచే వాటిని కూడా బిగ్గరగా నవ్వుతూ, సూపర్..సూపర్ అని ఎంకరేజ్ ఇవ్వడం మరింత దురదృష్టకరం.