చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తర్వాత ఆయన అభిమానుల పుణ్యమో.. లేక తమ కులం వాడు రాజకీయ పార్టీని స్థాపించాడని ఆయా కులం వారు చూపిన అత్యుత్సాహమో.. ఏది కారణమైనా సరే కాపు ముద్ర అనేది చిరంజీవికి పెద్ద మైనస్‌గా మారింది. ప్రతి చోటా ఈ కాపు కులం వారు కూడా... అంటూ ఏవేవో విమర్శలు వచ్చాయి. అవి నాటి సామాన్య ప్రజల మనసులో నాటుకుపోయి ఆ పార్టీ ఘోరపరాజయానికి ప్రధాన కారణం అయ్యాయి. సినిమాలలో అందరివాడుగా ఉన్న ఆయనను రాజకీయాలలో కొందరి వాడిలా మిగిలేలా చేశాయి.
ఇక విషయానికి వస్తే నాడు ప్రజారాజ్యం పార్టీ తరపున నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. పోసానికి తనదైన స్టైల్ ఉంది. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడు. సినిమాలలోనే కాదు.. నిజజీవితంలో కూడా ఆయన తనదైన యాటిట్యూడ్‌ని కలిగి ఉంటారు. ఇక ఆనాటి ఎన్నికల గురించి పోసాని మాట్లాడుతూ, నేను కొత్తగా నిలబడ్డాను.. ఓటేయమని ప్రచారానికి వెళ్లాను. ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆ ఇంటావిడను నాకు ఓటేయమని కోరాను. ఆమె ఇంట్లోకి రమ్మని పిలవడంతో ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాను. కొత్తవాడిని ఈ సారి నాకు ఓటేయండి అని అడిగాను.
కానీ ఆమె నువ్వు కాపోళ్ల పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నావు. వారు వస్తే మమ్మల్ని, కమ్మోళ్లని బతకనివ్వరు. నువ్వు మంచోడివే. అయినా నీ ప్రత్యర్ధికే ఓటేస్తానని చెప్పింది. దాంతో విషయం నాకర్దమై కనీసం టీ ఇస్తే తాగి వెళ్తాననని చెప్పాను. ఆమె టీ తెచ్చి ఇచ్చింది. దాన్ని తాగేసి వెళ్లిపోయాను. అంతేగానీ ఆ ఎన్నికల్లో నేను కులం పేరు చెప్పి ఓట్లు వేయమని వస్తున్న ప్రచారం తప్పని పోసాని కుండబద్దలు కొట్టాడు.