వాస్తవానికి మనం విలన్ పాత్రలు అని పిలుస్తాంగానీ వాటిని ప్రతినాయకుడి పాత్రలు అని పిలవాలి. నిజానికి పాతకాలంలో రాజనాల, రావుగోపాలరావు, ఆ తర్వాత కోటశ్రీనివాసరావు, రఘువరన్ వంటి వారు విలనిజాన్ని ఎంతో సమర్ధవంతంగా పోషించారు. వారు చేసిన ప్రతినాయక పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే హీరో క్యారెక్టర్, హీరోయిజం అంతలా ఎలివేట్ అవుతుంది. రాజనాల, రావుగోపాలరావు, కోట, రఘువరన్‌లు ఏమీ సిక్స్‌ప్యాక్ బాడీలతో కండలు పెంచి ఉండరు. కానీ ఆ తర్వాత మన సినిమా మేకర్స్ అభిరుచి మారిపోయింది. విలన్ అంటే కండలుతిరిగిన శరీరంతో ఉండాలని, ఆజానుబాహుడై ఉండాలని భావించి భాష, భావం తెలియని ఉత్తరాది వారిని తీసుకుంటూ వస్తున్నారు. రావుగోపాలరావు విలనిజం గూర్చి చెప్పుకోవాలంటే ఒక్క 'ముత్యమంత ముగ్గు' చాలు. ఇక కోట 'శత్రువు, రక్షణ, గణేష్'వంటి పాత్రల గురించి చెప్పుకోవాలి. ఇక 'శివ' చిత్రంలో రఘువరన్ పోషించిన పాత్ర నాగార్జునకి ఎంతగా ధీటైనదో అర్ధమవుతోంది.
ఇక విషయానికి వస్తే నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు ఎస్.జె.సూర్య. కానీ అవకాశాలు రాకపోవడంతో అజిత్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో దర్శకుడైపోయాడు. ఆయన తీసిన 'వాలి, ఖుషీ' చిత్రాలకు మురుగదాస్ ఆయన వద్ద అసిస్టెంట్‌గా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. ఇక నటునిగా కూడా ఎస్.జె.సూర్య స్థాయి ఏమిటో ఇప్పటికే తమిళ ప్రేక్షకులందరికీ తెలుసు. ఇక తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన 'స్పైడర్' చిత్రంలో ప్రతినాయకుని పాత్రలో సూర్య అదరగొట్టాడు. సైకోగా ఆయన పాత్ర రప్ఫాడించింది. ఈ చిత్రం ఫ్లాపయినా సరే ఈ మూవీ రిలీజైన తర్వాత సూర్యకి 20కి పైగా చిత్రాలలో ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి.
ఇక 'మెర్సల్' చిత్రంలో కూడా ఆయన తన విలనిజంతో మెప్పించాడు. కన్నింగ్ డాక్టర్‌గా ఆయన చూపించిన నటనకు ఈ చిత్రం డబ్బింగ్ 'అదిరింది' చూస్తున్న ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం దక్షిణాదిలో స్టైలిష్ విలన్‌గా ఎక్కువ క్రేజ్ ఎవరికుంది? అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఎస్.జె.సూర్య గురించే చెప్పుకోవాలి. మరి భవిష్యత్తులో ఆయన మరెన్ని పాత్రల్లో అందరినీ అలరిస్తాడో వేచిచూడాల్సివుంది...!