సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల మధ్య మనస్పర్దలు రావడం, మరలా వారు ఒకటిగా మారడం సహజమే. కాగా తమకు అండగా ఎవ్వరూ లేరని భావించామని, కానీ ఇండస్ట్రీలోని అందరూ ఇప్పుడు 'పీఎస్వీగరుడవేగ'కి ఇస్తున్న మద్దతు చూస్తే థ్యాంక్స్ అనేది చిన్నపదమని జీవిత కూడా చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేష్‌బాబు.. ఇలా అందరూ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక పాత విబేధాలను పక్కనపెట్టి మెగాస్టార్ చిరంజీవిని కూడా రాజశేఖర్ దంపతులు కలవడం, దానికి చిరు కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ కావడం తెలిసిందే. తమ మధ్య గతంలో విబేధాలు ఉండేవని, కానీ మరలా కలిసి ఎన్నో స్టేజీలు, షోలలో పాల్గొన్నామని, ఏం.. విబేధాలు వస్తే జీవితాంతం శత్రువులుగా ఉండిపోవాలా? మరలా కలవకూడదా? అని రాజశేఖర్ ఉద్వేగంగా ప్రశ్నించడం కూడా మెచ్చుకోదగిన విషయమే. ఇక రాజశేఖర్ మారాడు.... అనుకుంటున్న సమయంలో ఆయన మరలా 'గబ్బర్‌సింగ్'లో రాజశేఖర్‌ని అనుకరిస్తూ ఆయనపై వేసిన సెటైర్లను మరోసారి రాజశేఖర్ తెరమీదకి తెచ్చాడు.
పవన్ తన 'గబ్బర్‌సింగ్'లోని పోలీస్‌స్టేషన్‌లో జరిగే అంత్యాక్షరి సీన్‌లో రాజశేఖర్‌ని అనుకరిస్తూ సెటైర్లు వేశాడు. ఈ సీన్‌లో ఆయన స్నేహితుడు అలీ కూడా ఉన్నాడు. ఇక అలీ పవన్‌కి ఎంతో క్లోజ్. ఇక ఆయన రాజశేఖర్‌కి కూడా క్లోజ్‌ఫ్రెండ్. గతంలో వీరు పలు చిత్రాలలో కలసి నటించారు. ఇక పవన్ సెటైర్ల గురించి గతంలో కూడా రాజశేఖర్ రెండుమూడుసార్లు రియాక్ట్ అయ్యాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, గతంలో నేను పవన్‌ని కొన్ని మాటలు అన్నాను. ఆయన అది మనసులో ఉంచుకుని 'గబ్బర్‌సింగ్'లో ఆ సీన్ పెట్టాడు. దాంతో ఎంతో బాధపడ్డాను. ఆ సీన్‌లో అలీ కూడా నటించడం మరింత బాధపెట్టింది.
రాజశేఖర్ నాకు క్లోజ్ కాబట్టి అలాంటి సీన్ వద్దు అని పవన్‌కి అలీ చెప్పి ఉండాల్సింది. వీలుకాని పక్షంలో ఈ సీన్ నుంచి తాను బయటికి వచ్చి ఉంటే బాగుండేది. అది నిజంగానే నన్ను బాధించింది. అలీని అడగాలని భావించాను. కానీ అడగలేదు. అడిగితే ఆయన హర్ట్ అవుతాడని భావించాను. ఉన్న రిలేషన్‌షిప్ కూడా పాడవుతుందని మౌనంగా ఉన్నానంటూ మరలా పాత విషయాలను కెలికడం ఇప్పుడు రాజశేఖర్‌కి అంత అవసరమా? అనిపిస్తుంది...!