హీరోలు అంటే కేర్వ్యాన్ల్లోనే ఉంటారా? అదేం కాదు మట్టిలోనూ దొర్లుతారు.. ఇసుకలోనూ దాక్కుంటారు... తమ అభిమాన గణాన్ని మెప్పించడానికి ఎంతటి రిస్కులు చేయడానికైనా వెనకాడరు. ఇందుకు తాజా నిదర్శనం కార్తి. ఆయన 'ఖాకి' లో చేసిన యాక్షన్ సీక్వెన్స్ అందరినీ మెప్పిస్తున్నాయి. ఇసుక గోతుల్లో దాక్కుని శత్రుమూకల్ని వేటాడే దృశ్యాలు ప్రేక్షకుల్లో వేవ్ని క్రియేట్ చేస్తున్నాయి. కార్తి, రకుల్ ప్రీత్సింగ్ జంటగా నటిస్తున్న సినిమా 'ఖాకి'. హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ప్రై.లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించారు.
ట్రైన్ వెంట హీరో పరుగులు తీయడం, ఇసుకలో దాక్కుని గ్యాంగ్లపై దాడి చేయడం, విశాలమైన మైదానంలో గుర్రపు స్వారీతో ఛేజింగ్ చేయడం.. వంటి దృశ్యాలన్నీ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇన్ని రకాల యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి కార్తి పడ్డ కష్టం కళ్ల ముందు కనిపిస్తోంది. రాజస్థాన్లో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని చూడగానే అర్థమవుతుంది. సినిమాలో ఛేజ్ సన్నివేశాలను దాదాపు 60 రోజులు చిత్రీకరించినట్టు కార్తి రీసెంట్ గా చెప్పారు. దీన్ని బట్టి సినిమా ఎంత రేసీగా ఉంటుందో అవగాహన చేసుకోవచ్చు. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.