నేడు ఎందరో టాలెంట్ ఉన్న వారు సినిమా ఛాన్స్‌ల కోసం నానా కష్టాలు పడుతుంటారు. ముఖ్యంగా పూట గడవడం కోసం ఘోస్ట్‌లుగా మారి, తమకంటూ ఛాన్స్ రాదా? అని ఎదురు చూసేవారు ఎందరో ఉన్నారు. రచయితలుగా, సంభాషణ రచయితలుగా, కథా రచయితగా, లిరిక్ రైటర్స్‌గా ఎంతో మంది శ్రమదోపిడీతో పాటు మేథో దోపిడీకి కూడా గురవుతున్నారు. తాము కష్టపడి ఎంతో ఇష్టంగా రాసుకున్న కథలను కూడా పేరు పక్క వారికి ఇచ్చేసి వారిచ్చే పదిపదిహేను వేలకి రాజీపడుతున్నారు. మరికొందరు మాత్రం రాజీలేని పోరాటం చేస్తూ ఉంటారు.
తాజాగా 'శ్రీమంతుడు' నుంచి 'నేనే రాజు నేనే మంత్రి' వరకు ఇలా ఎందరినో చూస్తున్నాం. గతిలేని పరిస్థితులు, కథ ఎంత బాగా ఉన్నా అనుభవం లేదని, ఆ డైరెక్టర్‌పై నమ్మకం లేక అదే కథతో వేరే వారి దర్శకత్వంలో చిత్రాలు చేయిస్తున్నారు మన మేకర్స్. ఇక ఇలాంటి విషయాలపై వినాయక్ స్పందించాడు. ఇండస్ట్రీకి ఎవరైనా గుర్తింపు, పేరు కోసమే వస్తారు. పేరు, గుర్తింపు వస్తే అదే డబ్బు మన వద్దకు వస్తుంది. డబ్బు అనేది ఎదిగిన తర్వాత వస్తుంది. ఎదగాలంటే మంచి పేరు రావాలి. అందుకే అందరూ మొదట పేరు కోసం తాపత్రయపడుతూ, దాని మీదనే ఫోకస్ పెడుతారు.
ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ప్రతి టాలెంట్ ఉన్న వ్యక్తికి గుర్తింపు రావాలి. తాము పనిచేసిన సినిమా నుంచి క్రెడిట్ పొందని వారు నా వద్ద ఆ విషయం ప్రస్తావిస్తే ఎంతో బాధగా ఉంటుంది. పని చేయించుకుని క్రెడిట్ ఇవ్వకపోవడం తప్పు అన్నారు. ఇక నాటి మహాకవి శ్రీశ్రీ నేటి పరిస్థితులను చూసి ఉంటే శ్రమదోపిడీతో పాటు మేథో దోపిడీపై కూడా గళమెత్తేవారు.