తెలుగులో కమెడియన్స్‌కి కూడా స్టార్ హోదా తెచ్చిన వారిలో నటకిరీటి, హాస్యనట కిరీటి రాజేంద్రప్రసాద్‌ది తిరుగేలేని స్థానం. ఆయన హీరోగా కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన స్థానాన్ని ఎవరైనా భర్తీ చేస్తారా? అని అందరూ ఎదురుచూశారు. కాస్తలో కాస్త అల్లరినరేష్ ఆ లోటును పూడ్చాడు. కానీ రాజేంద్రుని స్థాయిలో మాత్రం కాదని చెప్పవచ్చు. ఇక రాజేంద్రుడు కామెడీ హీరోగానే కాకుండా 'మేడమ్ , రాంబంటు, ఎర్రమందారం' వంటి ఎన్నో విశిష్ట పాత్రలను కూడా చేశాడు. ఇక విషయానికి వస్తే ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌గా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ 'జులాయి' నుంచి 'ఈడోరకం ఆడోరకం' వరకు తనదైన శైలిలో మెప్పిస్తూనే ఉన్నాడు.
మరోవైపు యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ది కూడా మంచి కామెడీ టైమింగేనని చెప్పాలి. ఆయనలోని ఎనర్జీ లెవల్స్ ఒకప్పటి రాజేంద్రుడిని గుర్తుకు తెస్తాయి. అందుకే మొదట ఆయన నటించిన అలనాటి మేటి చిత్రం 'లేడీస్‌టైలర్'ని రాజ్‌తరుణ్‌తో 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్‌టైలర్'ని వంశీ దర్శకత్వంలోనే తీయాలని భావించారు. కానీ ఎందువల్లో ఆ పాత్రకు చివరకు సుమంత్ అశ్విన్ తీసుకున్నారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం రాజ్‌తరుణ్ హీరోగా అమైర్ దస్తూర్ హీరోయిన్‌గా సంజనరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మాత అనిల్‌సుంకర తమ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో 'రాజుగాడు' (యమ డేంజర్) చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రాజేంద్రప్రసాద్ ఓ కీలకమైన పాత్ర చేస్తున్నాడు.
రాజేంద్రుడు మంచి నటుడే కాదు.. బాగా వంట చేయడం కూడా ఆయనకు బాగా వచ్చు. దాంతో ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆయన వంట చేస్తూ కనిపిస్తుంటే ఆయన వంక ఆశగా చూస్తోన్న రాజ్‌తరుణ్ ఉన్న ఫోటోని అనిల్‌సుంకర పోస్ట్ చేశాడు. రాజేంద్రప్రసాద్ సెట్స్‌లో ఉంటే నవ్వులకే కాదు.. భోజనానికి కూడా లోటుండదు. ఆ ఫుడ్‌ని రాజ్‌తరుణ్ ఎలా దొంగిలించాలా? అని ఎదురుచూస్తున్నాడని కామెంట్ పెట్టాడు. దీనికి రాజ్‌తరుణ్ కూడా రాజేంద్రప్రసాద్ గారితో పనిచేయడం ఎంతో ఆనందంగా, సరదాగా ఉంటుంది. ఆ ఫుడ్‌ని దొంగిలిద్దామని భావించాను. అంతలో ఆయనే వడ్డించేశారు. చాలా రుచిగా ఉందని రిప్లై ఇచ్చాడు.
మొత్తానికి రాజేంద్రునితో రాజ్‌తరుణ్ చిత్రం అంటే మంచి ఆసక్తిఉంటుందనే చెప్పాలి. ఈ చిత్రంలో 'రాజుగాడు' యమడేంజర్ అనడానికి కారణం ఆయన దేనైనా దొంగిలించే బాపతేమో అనిపించకమానదు. మరి ఈ చిత్రం సంక్రాంతికి ఉన్న పెద్ద పోటీ చిత్రాలను ఎదుర్కోవడానికి జనవరి 14న విడుదల చేయనున్నారు.