చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అటు నిర్మాత రామ్ చరణ్ గాని... ఇటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గాని...మధ్యలో చిరు గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అదిగో... ఇదిగో అంటున్నారే గాని సినిమా మాత్రం రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోలేకపోతుంది. ఈ చిత్రం మొత్తం చారిత్రక నేపధ్యం వున్న ఉయ్యాలవాడ జీవిత చరిత్రతో తెరకెక్కుతుంది. మరి చరిత్రకారుల జీవితాలను తెరకెక్కించడం అంత ఆషామాషి విషయం కాదు. అప్పట్లో చరిత్రకారులు ఎలా ఉండేవారు... ఆనాటి పరిస్థితులకు ఇప్పుడు ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాలి... ఇంకా అప్పటి వాతావరణాన్ని సృష్టించాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని.
అయితే నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు ఈ సినిమాకోసం 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక సెట్ వేయిస్తున్నారట. ఆ సెట్ ఐదు గ్రామాలకు సంబందించిన సెట్ అని... దీని కోసం ఇప్పటికే పనులు మొదలయ్యాయంటున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ సెట్ కోసం చిత్ర బృందం ఒక లొకేషన్ ని ఎంచుకున్నారంటున్నారు. అక్కడ అన్ని హంగులతో అలనాటి వాతావరణాన్ని తలపించే ఆ ఐదు గ్రామాల సెట్ ఉండబోతుందట. మరి అలనాటి కట్టడాలు, గ్రామాలూ, ఆచార వ్యవహారాలన్నీ పక్కాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. లేదంటే చరిత్రని వక్రీకరించి సినిమాని తెరకెక్కించారని అపవాదు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఉద్దేశ్యంతోనే ఇలా చరణ్, చిరు, సురేందర్ లు ఆచి తూచి అడుగులు వెయ్యడం వలెనే సినిమా సెట్స్ మీదకెళ్లడానికి లేట్ అవుతుందట.