ఈ మధ్యన భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడం .. ఆ సినిమాల ఫలితంలో తేడా కొడితే... నిర్మాతలు సేఫ్ అయినా బయ్యర్లు రోడ్డున పడడం అనేది పరిపాటి అయ్యింది. అయితే సినిమాలు ప్లాప్ అయినప్పుడు కొందరు హీరోలు తమ రెమ్యునరేషన్ లో కొంతమొత్తం బయ్యర్లకి తిరిగి ఇచ్చేస్తున్నారు. కొందరు హీరోలు మాత్రం తమకు ఏమి పట్టనట్టుగా సైలెంట్ అవుతున్నారు. మరి నిజంగానే సినిమా చేసి చేతులు దులుపుకుంటే... ఇప్పుడు కుదరదు. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఇండస్ట్రీలో నష్టపోతే ఆ బాధ్యతను అందరూ పంచుకోవాలి. అదేగనక తప్పించుకోవాలని చూస్తే ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం.
ఇప్పుడలా ఒక బాలీవుడ్ హీరో బయ్యర్ల చేతికి భలేగా దొరికి పోయాడు. అతనెవరో కాదు కండలవీరుడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ సినిమా విషయంలో తప్పించుకున్న..... ఇప్పుడు మాత్రం 'టైగర్ జిందా హై' సినిమా దగ్గర అడ్డంగా బుక్కయిపోయాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించి.... భారీ అంచనాల మధ్య విడుదలైన ట్యూబ్ లైట్ సినిమా బాక్సాఫీస్ ముందు పేలిపోయింది. సినిమా విడుదలైన రెండో రోజుకే... ట్యూబ్ లైట్ వెలగలేదనే విషయం అందరికీ అర్థమైపోయింది. వందల కోట్లు పెట్టి కొన్న సినిమాతో నష్టాలు చూశారు బయ్యర్లు.
సినిమా భారీ డిజాస్టర్ అని మూడో రోజుకే గ్రహించిన సల్మాన్ ప్రమోషన్ కూడా ఆపేశాడు. అయితే విషయం మాంచి కాక మీదున్నప్పుడు నష్టపోయిన ఒకరిద్దరు బయ్యర్లను సల్మాన్ ఆదుకున్నప్పటికీ మిగతావారిని పట్టించుకోలేదు. అప్పుడేదో సల్మాన్ తప్పించుకున్నాడు.....కానీ ఇప్పుడు సల్మాన్ నటించిన 'టైగర్ జిందా హై' విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈసారి బయ్యర్లంతా ఒక్కటయ్యారు. గత సినిమా నష్టాల్ని భర్తీ చేసేలా ఈ కొత్త సినిమా డిస్ట్రిబ్యూషన్ రేట్లు తగ్గించాల్సిందిగా గట్టిగా పట్టుబట్టారు. లేకపోతే థియేటర్లలో సినిమా రిలీజ్ చేయమని హెచ్చరించారు. మరి మాంచి టైం చూసి బయ్యర్లు వేసిన దెబ్బకి సల్మాన్ ఖాన్ గిల గిల గించుకుని రేట్లు తగ్గించక తప్పలేదు. బయ్యర్లు మంచి టైం చూసి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు.