వాస్తవానికి భాష, ఇతర ఆచార వ్యవహారాలు, తమ సంస్కృతుల పరిరక్షణలో తమిళ తంబీలు ఎప్పుడు ముందుంటారు. తమ సంప్రదాయాలకు, పద్దతులకు ఏమాత్రం తేడా వచ్చినా వారు ఒకటై పోతారు. దానికి జల్లికట్టు ఓ ఉదాహరణ మాత్రమే. హిందీ వ్యతిరేకత, ఎమ్జీఆర్‌కి భారతరత్న, ఉత్తరాది వారి పెత్తందారితనంతో పాటు వారు కేంద్రం కిందకి వచ్చే రైళ్లను కూడా ప్రోత్సహించరు. మరి తప్పని పరిస్థితులలో తప్ప వారు తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ బస్సులనే ఉపయోగించుకుంటారు. నిజానికి మనం తెలుగువాడి పౌరుషం అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ తెలుగువారి పౌరుషం చనిపోయి ఎంతో కాలం అయింది. ఎవరు అధికారంలో ఉంటే వారికి వంత పాడటమే మన నైజం. ఇక మన నాయకులు కూడా అంతే. అంతెందుకు కేంద్రం, రాష్ట్రం, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రతిపక్షనాయకుల మాటలను, వారు తీసుకునే నిర్ణయాలను, ఓట్లను కూడా కులం, మతం ఆధారంగా చూస్తాం. తమ కులం నాయకుడు తప్పు చేసినా చేయలేదని వాదిస్తాం. మన కులానికి చెందని నాయకుడు మంచి నిర్ణయం తీసుకున్నా కూడా దానిని వంక పెడుతూ ఉంటాం.
ఇక విషయానికి వస్తే తమిళ రాజకీయాలలో కేంద్రం జోక్యం చేసుకుంటున్న నేపధ్యంలో ఇప్పటికే 'జల్లికట్టు' ద్వారా తామంతా ఒకటే అని చెప్పిన తమిళతంబీలు, 'మెర్సల్' చిత్రం విషయంలో రజనీకాంత్ నుంచి కమల్‌హాసన్, విశాల్‌తో పాటు అందరు ఒకటై మద్దతు తెలిపారు. ఇక కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్ వంటివారు నోట్ల రద్దు జరిగి ఏడాదైన సందర్భంగా తమ గళం విప్పుతున్నారు. తాజాగా హీరో శింబు కూడా పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా తానే పాట రాసి, తానే పాడాడు. ఆయన గతంలో పెద్ద నోట్ల రద్దుని సమర్దించినా కూడా ఈ నిర్ణయం ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వకపోగా సామాన్యులను ఇబ్బందుల పాలుజేసిందని, జీఎస్టీతో సామాన్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, రైతులకు ఏమీ సాయం చేయడం లేదని, చివరకు విజయ్ మాల్యావంటి వారు విమానాలెక్కి దర్జాగా తప్పించుకుంటున్నారని పాట రాసి పాడిన పాట వైరల్‌గా మారుతోంది.
ఇలాంటివి చేయడానికి, పాలకులను చూసి భయపడకుండా గళమెత్తడానికి దమ్ముండాలి. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరు దొంగనాటకాలు ఆడుతున్నా సమర్ధిస్తున్న మనకు తమిళ తంబీల పౌరుషాన్ని చూసైనా నేర్చుకోవాలి. గతంలో ఆయన మహిళలను కించపరుస్తూ పాడిన బీప్ సాంగ్ వివాదమైనా సరే.. నాడు ఆయన్ను ఖండించిన వారు కూడా నేడు శింబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.