ఇటీవల విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై బాగా విమర్శలు చేస్తున్నాడు. బెంగళూరులో రచయిత్రి, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య, తమిళనాడు రైతులు ఢిల్లీలో చేసిన పోరాటానికి స్వయంగా వెళ్లి మద్దతు ఇవ్వడం, కమల్‌హాసన్ హిందుత్వ తీవ్రవాద వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం, మోదీ తనకంటే గొప్పనటుడని ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రం సామాన్యులను ఇబ్బందులకు గురి చేసిందని, ఈ విషయంలో కేంద్రప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు.
పెద్ద నోట్లు రద్దయినా ధనికులు ఎన్నో మార్గాల ద్వారా నల్లధనాన్ని మార్చుకున్నారని, సామాన్యులే ఇబ్బందులు పడ్డారని ఆయన వ్యాఖ్యానించాడు. ఇక నల్లధనం నిరోధం కోసం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం కోసం సర్జికల్ ఆపరేషన్‌లా చేసిన ఈ చర్య ప్రహసంగా మారిందని ఆయన చెప్పారు. ఇక ఈ విషయంలో పలువురు మోదీ పెద్దనోట్ల రద్దుని దుయ్యబడుతున్నారు. ఈ నోట్ల రద్దు ద్వారా ఎంత నల్లధనం వెలికి తీశారు? విదేశాలలో ఉన్న నల్ల కుబేరులు ఇంకా ఎందుకు బయటికి రావడం లేదు?
ఇక స్విస్ బ్యాంక్‌కి కూడా ఆధార్‌ని అనుసంధానం చేస్తారా? కేవలం అంబాని కోసమే ఆయన పెట్రోల్‌పై జీఎస్టీ పెట్టలేదు. అంబానీ నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకే ఆయన ఈ పెద్దనోట్ల రద్దు చేశారు. డిజిటల్ ఇండియా అని మోదీ అంటోంది కూడా అంబానీ కోసమే అని పలువురు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.