తమిళంలో 'మెర్శల్' చిత్రం రిలీజ్ అయినప్పుడే తెలుగులో కూడా 'అదిరింది' డబ్బింగ్ వెర్షన్‌ని విడుదల చేయాలని భావించారు. ఇక విశాల్ 'తుప్పారివారన్'ని తెలుగులో 'డిటెక్టివ్'గా అదే రోజున విడుదల చేయాలని ఆనుకున్నారు. కానీ వీరు థియేటర్ల ప్రాబ్లమ్ అంటున్నారే గానీ అసలు సమస్య సెన్సార్ వద్దనే వస్తోందని తెలుస్తోంది. ఇక తెలుగులో లవర్‌బోయ్‌గా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం' మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్ద్ చిత్రం 'గృహం'కి కూడా సెన్సార్ సమస్యలే వెంటాడుతున్నాయి. ఈ చిత్రాన్ని మూడో తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీలలో కూడా ఒకేసారి విడుదల చేయాలని సిద్దార్ద్ భావించాడు.
కానీ సెన్సార్, థియేటర్ల సమస్యతో కేవలం తమిళంలో 'అరల్'గా మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. ఇక ఈ హర్రర్ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో ఉందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి తమిళంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రానికి ఇటీవల తమిళనాడులో థియేటర్లు కూడా పెంచారు. ఈ హర్రర్ మూవీని చూసి హాలీవుడ్ హర్రర్ సినిమా టైప్‌లో ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలవుతున్నారట. ఇందులో అసలుసిసలైన హర్రర్ తప్ప ఇతర అనవసర సన్నివేశాలు, అనవసర కామెడీ ట్రాక్‌లు ఉండవని సిద్దార్ద్‌తో పాటు సినిమా చూసిన వారు కూడా చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో 10వ తేదీన విడుదల చేయాలని భావించారు. అది కూడా వాయిదాపడింది. దీంతో నవంబర్ 17న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులో 'గృహం' గా వస్తోన్న ఈ చిత్రంలో సిద్దార్ద్ నటించడమే కాదు.. స్వయంగా తానే నిర్మించాడు. అయితే హర్రర్ చిత్రాలకు భాషా సమస్య లేకపోవడంతో ఇప్పటికే ఈ చిత్రం ఆన్‌లైన్ పైరసీ విడుదల కావడం, ప్రింట్ కూడా బాగుంటంతో చాలామంది తెలుగు, హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని తమిళంలో చూసేశారు. మరి తెలుగులో ఈ చిత్రం విడుదలైతే ఏ మాత్రం ఆదరణ లభిస్తుందో వేచిచూడాల్సివుంది...!