దీపికాపడుకోనే.. ఆమె అందం, అభినయం రెండు కలగలిసిన హీరోయిన్. దీంతోనే ఆమెకు బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లో కూడా మంచి ఛాన్స్‌లు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాజ్‌పుత్‌రాణి పద్మావతి పాత్రలో 'పద్మావతి' అనే చిత్రం చేస్తోంది. ఇందులో షాహిద్ పూర్, రణవీర్‌సింగ్‌లు ఇతర పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం 'మెర్సల్'లా వివాదాలకు కారణమవుతోంది. 'మెర్సల్' చిత్రానికి విడుదల తర్వాత వివాదాలు వచ్చాయి. దాంతో యావరేజ్ చిత్రమైనా సరే.. మంచి కలెక్షన్లను ఈ చిత్రం కొల్లగొట్టింది. 'మెర్శల్' చిత్రం విడుదల తర్వాత వివాదాలకు కారణం అయితే 'పద్మావతి' చిత్రం మాత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి వివాదాలతో సహవాసం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే రాజస్థాన్‌కి చెందిన రాజ్‌కర్ణిసేన నాయకులు దాడులు చేసి, తుపాకీలతో రెచ్చిపోయారు. షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా అక్కడ దాడులు చేసి సెట్స్‌ని సైతం కాల్చేశారు.
ఇక తాజాగా ఈ చిత్రం విడుదలను ఆపివేయాలని లేకపోతే థియేటర్లను తగుల బెడుతామని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో దేశం హోరెత్తుతోంది. ఇందులో రాణి పద్మావతిని అల్లావుద్దీన్‌ఖిల్జీతో ప్రేమయాణం నడిపినట్లు చూపించారని, ఈ చిత్ర దర్శకుడు చరిత్రను వక్రీకరిస్తూ కట్టుకథలు అల్లాడని, ఈ చిత్రాన్ని ముందుగా రాజ్‌పుత్ నాయకులకు చూపించి అనుమతి తీసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. ఖిల్జీ చిత్తోర్‌గడ్‌పై దాడి చేశాడని, నాడు ఆయన చెరపడకుండా పద్మావతితో పాటు 16వేల మంది మహిళలు ప్రాణాలు తీసుకున్నారని వారు వాదిస్తున్నారు. మరోవైపు సంజయ్‌లీలా భన్సాలీపై గతంలో కూడా తన చిత్రాలలో చరిత్రను వక్రీకరించాడనే అపవాదు ఉంది.
ఇక ఈ 'పద్మావతి'లో దీపికా పడుకోనే మహారాణిలా, యోధురాలిగా కత్తిని చేతబట్టి యుద్ద విన్యాసాలు చేయడమే కాదు... ఆ కత్తితో, తన అందంతో అందరి గుండెలలో కత్తిని దించాలని చూస్తోంది. దీంతో ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానికి ఓ ఐడియా వచ్చింది. కత్తితో ఉన్న దీపికా పడుకొనే క్రేజ్‌ను వాడుకోవాలని భావించిన ఆయన కత్తిలో ఉన్న దీపికా ఫొటోను తీసి క్యాలెండర్ కోసం ఫొటోషూట్ చేసి 'పద్మావతి'ని బాగా వాడుకోవడంలో తల మునకలై ఉన్నాడు.