సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాలో చేసిన పాత్ర హిట్ అయిందంటే ఆయా హీరోయిన్లకు అలాంటి పాత్రలే ఇస్తుంటారు. నాటి యమున , ఊహ, సౌందర్య నుంచి తాజాగా నిత్యామీనన్ వరకు దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. ఈమధ్య కేవలం ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్స్‌లో, లేదా చిన్న నిడివి కలిగిన రెండో లేదా మూడో హీరోయిన్‌గా మాత్రమే నిత్యామీనన్‌కి అవకాశాలు ఇవ్వడం చూస్తున్నాం. తాజాగా మరో హీరోయిన్‌కి కూడా అలాంటి ముద్రే వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో మలయాళకుట్టిల హవా బాగా సాగుతోంది. ఇక వీరిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు.
ఆమె నటించిన 'ప్రేమమ్, అ..ఆ.., శతమానం భవతి' వంటి చిత్రాలలో సంప్రదాయబద్దమైన పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇక ఈమె నటనలోనే కాదు ఎంతో హోమ్లీగా కూడా ఉంటుంది. కానీ హైట్ విషయంలో, గ్లామర్ డోస్ పెంచే విషయంలో ఈమెకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇక ఇటీవల వచ్చిన రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలోని 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా అనుపమకి మాత్రం మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. ఆమెకి ఏ విషయంలోనూ లావణ్యత్రిపాఠి పోటీ కాలేకపోయింది.
కాగా ఈ చిత్రంలోని ఆమె పాత్ర మధ్యలోనే చనిపోతుంది. దర్శకుడు మొదట తన పాత్ర చనిపోతుందని చెబితే జోక్ అనుకున్నానని, కానీ దర్శకుడు కిషోర్‌తిరుమల తనని కన్విన్స్ చేశాడని ఆమె చెప్పింది. ఇక ఈ చిత్రంలో ఆమె చెప్పిన ఓన్ డబ్బింగ్ కూడా బాగుంది. ఇలాంటి సమయంలో అనుపమపరమేశ్వరన్ దగ్గరకు ఓ స్టార్ డైరెక్టర్, ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ రూపొందే చిత్రంలో అవకాశం వచ్చిందట. దాంతో అనుపమ ఎంతో సంతోషపడింది. కానీ కథ వింటే మాత్రం అందులో కూడా తన పాత్ర మధ్యలో చనిపోయే పాత్ర కావడంతో ఆమె నిక్కచ్చిగా నో చెప్పేసింది. ఈ విషయంలో ఆమె నిర్ణయం కరెక్టేనని చెప్పాలి. ఎందుకంటే ఇలా మధ్యలో చనిపోయే పాత్రలో మరో చిత్రంలో చేసిందంటే చాలు... ఇక అలాంటి పాత్రలనే ఆమె కోసం తెస్తూ, ఆమెపై అలాంటి ముద్రని మన మేకర్స్ వేసేస్తారు.