పదేళ్ల తర్వాత మరలా తనదైన యాంగ్రీమేన్ స్టైల్‌లో రాజశేఖర్ బ్లాక్‌బస్టర్ సాధించాడు. ఆయనకు గతంలో కూడా బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. కానీ దీనికి మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక రాజశేఖర్ పని అయిపోయింది.. విలన్ వేషాలు, సపోర్టింగ్‌రోల్స్ చేయాల్సిందే అని భావిస్తున్న సమయంలో 'పీఎస్వీ గరుడవేగ' ఆయనతో నూతనోత్తేజాన్ని నింపి, ఇప్పటికీ ఆయనలో హీరో మెటీరియల్ ఉందని చాటి చెప్పింది. అయితే ఈ చిత్రం విజయంతో తనదైన నటనతో పాత రాజశేఖర్ సత్తాని చూపించిన ఆయనకి, హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్‌సీన్స్ చిత్రీకరించి, తాను పెద్ద హీరోలను కూడా హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్న దర్శకుడు ప్రవీణ్‌సత్తార్, నిర్మాత కోటేశ్వరరాజులు ఈ సక్సెస్‌ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో గానీ అంతకంటే ఈ విజయం మా వల్లనే దక్కిందని ఇటు బాలయ్య ఫ్యాన్స్, మరోవైపు మెగాస్టార్ ఫ్యాన్స్ హడావుడి ఎక్కువైంది.
బాలయ్య ఎక్కడ అడుగుపెట్టినా శుభం జరుగుతుందని, బాలయ్య ముహూర్తం పెట్టి మరీ ట్రైలర్ లాంచ్ చేయడంతో రాజశేఖర్ దశ తిరిగిందని బాలయ్య అభిమానులు అంటున్నారు. మరోవైపు రాజశేఖర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తర్వాతే రాజశేఖర్‌కి పీడ విరగడై చిరు ఆశీర్వాదం వల్లే చిత్రం సక్సెస్ అయిందని, రాజశేఖర్‌కి మెగాస్టార్ విషయంలో బుద్ది వచ్చినందునే ఈ చిత్రం విజయం సాధించిందనే వాదనలు వస్తున్నాయి. దానిపై తాజాగా రాజశేఖర్ ఎమోషనల్ అయ్యాడు. అలా రాయడం వద్దని, చిరుకి, తమకు బేధాలున్న మాట వాస్తవమేనని, కానీ అవి ఎప్పుడో పరిష్కారం అయ్యాయి. తామిద్దరం పలు వేడుకలకు కూడా కలిసి హాజరయ్యామని ఆయన చెప్పాడు. బేధాలు వచ్చిన వారు జీవితాంతం శత్రువులుగానే ఉండాలా? మరలా కలవకూడదా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక ఈ చిత్రం విషయంలో తాము ఐదుగురికి రుణపడి ఉన్నామని జీవిత చెప్పుకొచ్చింది. రానా, కాజల్, తాప్సి, మంచు లక్ష్మి వంటి వారు టీజర్‌ని అడిగిన వెంటనే రిలీజ్ చేశారని, వారిలో కొందరితో తమకు పెద్ద పరిచయం లేకపోయినా వారు తాము అడిగింది చేసి ప్రమోషన్ చేసి పెట్టారని, ఆ తర్వాత బాలయ్య సహకారం కూడా మర్చిపోలేమని, మొత్తానికి ఈ ఐదుగురికి రుణపడి ఉంటామని చెప్పింది. ఇక రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి, మహేష్‌బాబు, రాజమౌళి వంటి వారు కూడా తమకు ఎంతో సాయం చేశారని, మా వెంట ఎవ్వరూ లేరు.. మేము ఒంటరి అని భావిస్తున్న సమయంలో ప్రేక్షకులు, ఇండస్ట్రీవారు తమకు అండగా నిలిచారని, వారికి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదని తెలిపింది.