అల్లు అర్జున్ - వక్కంతం వంశి కలయికలో 'నా పేరు సూర్య' సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లినప్పుడే ఏప్రిల్ 27 న రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి అదే రోజు 'భరత్ అనే నేను' సినిమా కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ప్రొడ్యూసర్ డివివి దానయ్య. దీంతో 'నా పేరు సూర్య' చిత్ర బృందం వెనక్కు తగ్గే సమస్యే లేదని, ఏది ఏమైనా అదే డేట్ కు వస్తామని ప్రకటించేసింది. ఈ విషయమై 'నా పేరు సూర్య' నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు కాస్త ఘాటుగానే స్పందించాడు.
ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే కలెక్షన్స్ మీద దెబ్బ పడే అవకాశం ఉందని అలోచించి డివివి దానయ్య ఓ పరిస్కారం కోసం 'నా పేరు సూర్య' సినిమా ప్రొడ్యూసర్స్ ని కలవాలని అనుకున్నాడు. జస్ట్ మూడు రోజులు క్రితం దానయ్య వెళ్లి.... గీతా ఆఫీసులో బన్నీవాస్, నాగబాబులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఏప్రియల్ 27న బన్నీ సినిమా వుందన్న సంగతి తనకు గుర్తు లేదని.... పొరపాటున 'భరత్ అనే నేను' సినిమా డేట్ ప్రకటించానని, ఇప్పుడు ఏం చేద్దామన్నది మీరే చెప్పండని వారిరువుర్ని దానయ్య కోరినట్లు తెలుస్తోంది.
దానికి గీతా ఆర్ట్స్ వర్గాలు... తాము ఇప్పుడు వెనక్కు తగ్గితే రీజన్ అనేది లేకుండా తగ్గినట్లు అవుతుందని, చాలా సమస్యలు వస్తాయని, అదే మీరు (దానయ్య) తెలియకుండా డేట్ ప్రకటించారు కాబట్టి... మీ సినిమా పోస్ట్ పోన్ గాని ప్రీ పోన్ గాని చేసుకుంటే... తెలిసి తప్పు సరిదిద్దుకున్నట్లు అవుతుందని వివరించినట్లు తెలుస్తోంది. కుదిరితే దీనిపై మళ్ళీ ఇంకోసారి కూర్చుందామని నా పేరు సూర్య నిర్మాతలు పేర్కొన్నట్టుగా సమాచారం.
ఇకపోతే అదే నెలలో రామ్ చరణ్ సినిమా 'రంగస్థలం' వచ్చే అవకాశం వుంది. 'రంగస్థలం' వచ్చిన రెండు వారాలకి మహేష్ సినిమా వచ్చేటట్టు అంటే ఏప్రిల్ 13 న, ఆ తర్వాత రెండు వారాలకి బన్నీ సినిమా వచ్చేలాగా అయితే బెటర్ అని గీత వర్గాలు అభిప్రాయ పడుతున్నట్లుగా తెలుస్తోంది. సమ్మర్ కాబట్టి పెద్ద సినిమాలే కాకుండా మీడియం సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. వీటన్నింటికి తోడు '2 .0 ' కనుక జనవరి నుంచి సమ్మర్ కు వస్తే... ఇప్పుడున్న సీన్ మొత్తం మారిపోతుంది.