తాజాగా సుశీంద్రన్ వంటి టాలెంట్ ఉన్న తమిళ దర్శకునితో సందీప్‌కిషన్ చేసిన చిత్రం 'కేరాఫ్ సూర్య' చిత్రం ఈ వీకెండ్‌లో విడుదల కానుంది. శంకర్ చిగురుపాటి సమర్పణలో చక్రి చిగురుపాటి నటిస్తున్న ఈ చిత్రాన్ని అందరూ డబ్బింగ్ చిత్రమని మాట్లాడటం సరికాదని సందీప్‌కిషన్ ఉద్వేగభరితంగా చెప్పాడు. తమిళ హీరోలు తమ చిత్రాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ, ద్విభాషా చిత్రంగా చెప్పుకుంటూ మార్కెట్‌ని విస్తరించుకుంటున్నారు. మరి నేను ద్విభాషా చిత్రాన్ని చేస్తే దానిని డబ్బింగ్ చిత్రం అనడం బాధగా ఉంది. తమిళ దర్శకుడు డైరెక్ట్ చేసినంత మాత్రాన ఇది డబ్బింగ్ చిత్రం అయిపోతుందా?
నా పేరు సందీప్‌కిషన్, మా నాన్న పేరు రవిప్రకాష్ నాయుడు. మా తల్లి పేరు కనకదుర్గ. మా మావయ్య చోటాకెనాయుడు. నేను అచ్చమైన తెలుగువాడిని. నన్ను పరాయి భాషా నటునిగా చూడవద్దు. ఈ చిత్రానికి నిర్మాతలు అయిన శంకర్ చిగురుపాటి, చక్రి చిగురుపాటిలు కూడా తెలుగువారే. ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి కేవలం 59రోజుల్లో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందించాం. ఇక నేను నటించిన 'నగరం' చిత్రాన్ని మాత్రం తెలుగులో డబ్ చేశాం. ఆనాడు నిర్మాతలు దీనిని ద్విభాషా చిత్రంగా ప్రమోషన్ చేయమని అడిగినా నేను ఒప్పుకోలేదు. డబ్బింగ్ చిత్రమనే చెప్పాను. కానీ 'కేరాఫ్ సూర్య' మాత్రం ద్విభాషా చిత్రం అని ఉద్వేగంగా చెప్పుకుని వచ్చాడు.
ఇక సుశీంద్రన్ ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడని సందీప్‌కిషన్ చెబుతూ, మా మీద నమ్మకంతో థియేటర్స్‌కి రండి అని ప్రసంగించాడు. ఇక దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ, నాకు ధనుష్ అంటే ఇష్టం. ధనుష్ చేసినంత చక్కగా సందీప్‌కిషన్ కూడా చేశాడు... అని పొగడ్తలు కురిపించాడు. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇస్తున్నారని, స్ట్రెయిట్ తెలుగు చిత్రంగా వస్తున్న మంచు మనోజ్ నటించిన 'ఒక్కడు మిగిలాడు'కి థియేటర్లు ఇవ్వడం లేదని గొడవ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న ప్రముఖ థియేటర్ మల్లికార్జునని 'కేరాఫ్ సూర్య'కి కేటాయించడంపై 'ఒక్కడు మిగిలాడు' దర్శకుడు అండ్రూ విమర్శలు చేస్తున్న నేపధ్యంలోనే ఇలా సందీప్‌కిషన్ ఎమోషనల్ అయ్యాడని అంటున్నారు. ఇందులో సందీప్‌కిషన్ మాటల్లో కూడా వాస్తవమే ఉందని చెప్పుకోవాలి...!