బాలయ్య చిత్రం అంటే అందులోని డైలాగ్స్ ఎవరికైనా ఎక్కడలేని ఎనర్జీని ఇస్తాయి. ఆయన దర్శకులు, నిర్మాతలు, యూనిట్, అభిమానులకే కాదు.. తోటి నటీనటులకు కూడా బాలయ్య ఎనర్జీ వేయి ఏనుగుల శక్తిని ఇస్తుందనేది తెలిసిందే. కాగా తమిళంలో ప్రముఖ కమెడియన్ అయిన వివేక్ కూడా తాజాగా అదే మాట చెప్పాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ తన 102వ చిత్రం తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి స్టార్స్‌తో మరిచిపోలేని బ్లాక్‌బస్టర్స్ అందించిన కె.ఎస్.రమికుమార్ ఈ కథను రజనీ కోసం తయారు చేసుకుని ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్నాడనే అంశం ఎంతో ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడా? లేక ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? అనే వాటితో పాటు ఇందులో బాలయ్య ఓ ఫ్యాక్షన్ లీడర్ అని, పవర్‌ఫుల్ ఐఎఎస్ అని, కాదు కాదు ఇందులో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని వివిధ రకాలుగా ప్రచారం సాగుతోంది. ఆమద్య విడుదల చేసిన స్టిల్స్‌లో అక్కడి రాజకీయ నాయకుల వేషధారణలో ఉన్న వారిని, వారిలో వైజాగ్ ఎంపీ సీటు ఫలానా వ్యక్తికే ఇవ్వాలని ధర్నా చేస్తున్న వారిని బాలయ్య లాఠీతో తరుముతున్నాడు. ఇక ఇందులో నయనతారది కూడా పవర్‌ఫుల్ పాత్ర అని అంటున్నారు. వీరిద్దరు గతంలో 'శ్రీరామరాజ్యం, సింహా' చిత్రాలలో కలిసి నటించారు. టైటిల్‌లోనే సింహా పేరుండటంతో పాటు నయనతార సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయి ఇది వారి హ్యాట్రిక్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు బాలయ్య.. నయనతారని ఎక్కించుకుని లవ్లీగా బైక్‌పై రైడ్ చేస్తోన్న స్టిల్ చూస్తే ఇందులో మంచి రొమాన్స్, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్, పవర్‌ఫుల్ పంచెస్, డైలాగ్స్‌తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని బాలయ్య అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 'పైసావసూల్'తో ప్రేక్షకులను నిరాశపరిచిన బాలయ్య తనకు అచ్చి వచ్చిన సంక్రాంతి సీజన్‌లో అదరగొడుతాడని అంటున్నారు. కాగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రంలో నటాషా, హరిప్రియలు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.