పరుచూరి బ్రదర్స్,.. నిన్న మొన్నటివరకు వారు తిరుగేలేని రచయితలు, ఎన్టీఆర్ నుంచి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరికీ పనిచేశారు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన సోషల్ మీడియా పేజీలో సూపర్ స్టార్ కృష్ణ గారి గొప్పతనం గురించి తెలిపారు. 'అనురాగదేవత' షూటింగ్ సమయంలో అన్నదమ్ములమైన మేము ఎప్పుడు విడిపోకూడని ఎన్టీఆర్ గారు పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేశారు. ఇక మాకు లైఫ్‌ని ఇచ్చింది కృష్ణగారు. ఎన్టీఆర్, కృష్ణలు మాకు రెండు కళ్ల వంటి వారు. మేము మొదట కృష్ణ నటించిన 'పగబట్టిన సింహం, బంగారు భూమి' చిత్రాలకు ఘోస్ట్ రైటర్స్‌గా పనిచేశాం. 'బంగారు భూమి'లో ఓ డైలాగ్ రాశాం.. 'పద్మా... మనిషిని నమ్ముకుంటే మన నోటిలో మట్టికొడతాడు, అదే మట్టిని నమ్ముకుంటే మన నోటికిముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేసి, టెంకాయ కొట్టు' అనే డైలాగ్ ఎవరో రాశారో తెలుసుకుని మేము బాగా ఎదుగుతాం అని కృష్ణ గారు ప్రోత్సహించారు.
1982లో కృష్ణగారు పది చిత్రాలలో నటిస్తే, 8 చిత్రాలకు మాకే అవకాశం ఇచ్చారు. ఇక కృష్ణగారి 200వ చిత్రం 'ఈనాడు' విషయానికి వస్తే ఈ చిత్రం మలయాళ సినిమా చూడమని ఆయన మాకు చెప్పారు. ఆ సినిమాలో మలయాళం హీరో వయసు 55ఏళ్లకు పైనే. కానీ మేము ఆ పాత్రను కుర్రాడిగా మలిచి, కుటుంబబంధాలను చేర్చి కథ, డైలాగ్స్‌రాశాం. కృష్ణగారిని 'ఏకలవ్య' షూటింగ్‌లో కలిస్తే 'ఈనాడు'ని శ్రీధర్ ని పెట్టి తీద్దామన్నారు. వద్దుసార్ అన్నాం. పోని ఇది విప్లవాత్మక చిత్రం కాబట్టి మాదాల రంగారావుతో చేద్దామని అన్నారు. వద్దు సార్ అన్నాం. మరి ఎవరు హీరో? అని అడిగితే మీరే హీరోగా నటిస్తే సంచలనం సృష్టిస్తుందని చెప్పాం. ఆయన ఈ చిత్రంలో హీరో పాత్రకు డ్యూయోట్స్ లేవు. లవ్‌సీన్స్‌లేవు. ఫైట్స్ లేవు కదా? అని అడిగినా మేము మీరే నటించాలని పట్టుబట్టాం.
ఆ చిత్రం సంక్రాంతి సీజన్‌లో విడుదలైంది. కృష్ణగారు ఈ పండగకి విడుదలవుతున్న అన్ని చిత్రాలలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి మన సినిమాలో లేవు. అయినా నా వందో చిత్రం 'అల్లూరి సీతారామరాజు', 200వ చిత్రం 'ఈనాడు' అని చెప్పి, తనతో పాటు సినిమా థియేటర్‌లో చూడాలని కండీషన్ పెట్టారు. మొదట విజయవాడలో థియేటర్‌లో కృష్ణగారితో కలిసి ఈ చిత్రం చూశాం. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఇక గుంటూరు వెళ్లి అక్కడ థియేటర్‌లో చూశాం. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది ఈయనే అని నన్ను పరిచయం చేశారు. దాంతో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని అక్కడి కృష్ణ అభిమానులు నా బుగ్గలపై కూడా కొరికేశారు. దాంతో 'ఆగండయ్యా బాబు' అని తప్పించుకోవాల్సి వచ్చింది. నాటి ఘటనను ఎప్పటికీ మర్చిపోలేం అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.